రాజధాని ఫైల్స్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని పైల్స్ సినిమాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ , ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని.. గతేడాది డిసెంబర్ 18న సీబీఎఫ్‌సీ జారీ చేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా శుక్రవారం విచారణ జరిగింది. సీఎం, ప్రభుత్వం ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా సినిమా ఉందని పిటిషన్ తరపున లాయర్ కోర్టుకు చెప్పారు.. స్టేను కొనసాగించాలని కోరారు. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన పత్రాలను పరిశీలించిన హైకోర్టు.. స్టే కొనసాగించేందుకు నిరాకరించింది. నిబంధనల మేరకు అన్ని సర్టిఫికెట్లు జారీ చేశారని.. అయితే స్టే కొనసాగించేందుకు ధర్మాసనం తిరస్కరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. రాజధాని ఫైల్స్ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్వహకులు సన్నాహాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రధాన అంశంగా రాజధాని ఫైల్స్ సినిమాను భానుప్రకాశ్ తెరకెక్కించగా.. కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ నటించారు.