తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. సప్త వాహనాలపై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత ఉదయం 4.30 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుంచి వాహనమండపానికి వేంచేశారు. అక్కడ విశేష సమర్పణ చేపట్టారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనసేవ మొదలైంది. అక్కడి నుంచి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలికిరణాలు శ్రీ మలయప్పస్వామివారి పాదాలను స్పర్శించాయి. ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేసింది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.