ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీలు కల్పిస్తూ ఈనెల 6, 8వ తేదీల్లో రాజ్యసభ, లోక్‌సభలు పాస్‌చేసిన రాజ్యాంగ (ఎస్టీ) ఉత్తర్వుల (సవరణ) బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్టరూపం వచ్చింది. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ చట్టాన్ని అనుసరించి ఇప్పుడు రాజ్యాంగ (ఎస్టీ) ఉత్తర్వులు 1950లో ఎంట్రీ నం.25 కింద కొత్తగా పొర్జ, బోండో పొర్జ, ఖోండ్ పొర్జ, పరంగిపొర్జ కులాల పేర్లను చేర్చారు. అలాగే ఎంట్రీ నం.28లో సవరాస్, కాపు సవరాస్, మలియా సవరాస్, కొండ సవరాస్, ఖుట్టో సవరాస్ కులాలను చేర్చారు. ఈ కులాలకు ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీ హోదా దక్కుతుంది.
ఏపీలో వాల్మీకి, బోయ, వడ్డెర కులాలను ఎప్పటి నుంచో కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే కొన్ని తీర్మానాలు చేసి కేంద్రానికి పంపారు. అయితే ఆ కులాలను కాకుండా తాజాగా 9 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. దీంతో వాల్మీకి, బోయ, వడ్డెర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు పోరాటాన్ని ముమ్మరం చేయాలని కొందరు భావిస్తున్నారు. తెలంగాణలో కూడా వాల్మీకి, బోయ, వడ్డెర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ ఉంది.