ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు అదిరే గుడ్‌న్యూస్.. విచిత్రంగా వీకెండ్‌లో ఇలా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2024, 09:26 PM

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్. రథసప్తమి మరుసటి రోజే అనూహ్యంగా భక్తుల రద్దీ తగ్గింది. శనివారం స్వామివారి దర్శనం కోసం ఎలాంటి కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఉదయం 07 గంటల తర్వాత సర్వ దర్శనానికి వెళ్లే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది . శుక్రవారం స్వామివారిని 77,483 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.0 కోట్లు ఆదాయం రాగా.. 19,276 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సాధారణంగా వీకెండ్‌లో భక్తుల రద్దీ పెరుగుతుంది.. కానీ విచిత్రంగా రద్దీ తగ్గిపోయింది.


టీటీడీ ఆధ్వ‌ర్యంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆల‌య నిర్మాణ ట్ర‌స్టు(శ్రీ‌వాణి) నిధులతో ఇటీవల కొన్ని జిల్లాల్లో నిర్మించిన ఆలయాల్లో సామాజిక తనిఖీ నిర్వహించామని, ఆయా గ్రామాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోఆల‌యాల నిర్మాణంపై ఈవో స‌మీక్ష నిర్వ‌హించారు. శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల మత్స్యకార, గిరిజన, వెనుకబడిన తరగతులు ఉన్న ప్రాంతాల్లో 320 ఆలయాల నిర్మాణం పూర్తయిందన్నారు ఈవో. ఇందుకోసం దాదాపు రూ.26 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. భారత ప్రభుత్వంచే ఏర్పాటైన చట్టబద్ధమైన వ్యవస్థ ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో నమోదైన ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ సంస్థల ద్వారా సామాజిక తనిఖీ చేయించినట్టు తెలిపారు.


ఈ సంస్థలు 50 ప్రశ్నలతో ప్రశ్నావళి రూపొందించి అన్ని ఆలయాల పరిసర ప్రాంతాల ప్రజల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టాయన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిశీలించగా, ఆలయాల నిర్మాణం వారికి ఆనందం కలిగించిందని, క్రమం తప్పకుండా ఆలయాలకు వెళ్లి పూజలు, భజనలు, ఉత్సవాలు నిర్వహిస్తూ హిందూ ధర్మ ప్రచారానికి దోహదపడుతున్నారని తెలిసిందని వివరించారు. ఆయా గ్రామాల్లో ఆలయాలు నిర్మించిన తర్వాత దివ్యానుభూతి కలిగిందని గ్రామస్తులు తమ అభిప్రాయాలను తెలియజేశారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో మతమార్పిడులు దాదాపుగా ఆగిపోయాయని స్పష్టమైందని తెలిపారు. ఆలయాల నిర్మాణం ద్వారా మత్స్యకార, గిరిజన, వెనకబడిన ప్రాంతాల్లో హిందూ ధర్మ ప్రచారం చేయడం టీటీడీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు.


 


ఆకట్టుకున్న చెన్నై కళాకారుల పంచవాద్య సంగీతం, కేరళ కళాకారుల మోహినీ అట్టం నృత్యం


 


తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో నిర్వ‌హించిన ర‌థ‌స‌ప్త‌మి వాహ‌న‌సేవ‌ల్లో టీటీడీ హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్, దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 900 మంది క‌ళాకారులు పాల్గొన్నారు. ఒక్కో వాహన సేవలో 5 కళాబృందాలలోని కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కళాకారులు కోలాటం, లెజిమ్స్, దీపనృత్యం, కేరళ – ఓనం నృత్యం, జానపద నృత్యం, గోపికా నృత్యం, హారతి నృత్యం, అన్నమయ్య విన్నపాలు నృత్య రూపకం, రాజస్థాన్ – దాండియా నృత్యం, పాండిచ్చేరి – కరగాట్టం ఆకట్టుకున్నాయి. వీటితోపాటు మోహినీ అట్టం, తెలంగాణ – గర్భ నృత్యం, బిందెల నృత్యం, కూచిపూడి నృత్యం, మహారాష్ట్ర లావణి నృత్యం, అస్సాం – భుయ నృత్యం, బెంగాలీ నృత్యాలను కళాకారులు చక్కగా ప్రదర్శించారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి రాజగోపాల్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com