కరెన్సీ పేరుతో సరికొత్త మోసాలు మొదలు పెట్టారు కొందరు కేటుగాళ్లు.. ఇవ్వాల్సిన సొమ్ముకు బ్లాక్ కరెన్సీ ఇస్తాం.. ఆ నోట్లు వేరుగా ఉంటాయి. వాటికి కెమికల్ పూస్తే అసలైన రూ.500గా మారిపోతాయని నమ్మించి మోసం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన జగదీష్, గంగామహేశ్వరరావు, వీర్రాజు, రాజేంద్రకుమార్‌లు.. బిక్కవోలు మండలానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.20 లక్షలు తీసుకున్నారు. అప్పు బ్లాక్ కరెన్సీ రూపంలో తీర్చేస్తామని నమ్మబలికారు. తమతో తెచ్చిన ప్యాకింగ్‌లో నాలుగు కట్టలను అతనికి ఇచ్చేశారు. వాటితో పాటు ఓ రసాయనం కూడా ఇచ్చారు.
ఆ నోట్ల కట్లకు కెమికల్ పూస్తే అసలైన రూ.500 నోట్లుగా మారుతాయని నమ్మించారు. వాటిని నమ్మిన బాధితుడు ఆ రసాయనాన్ని నలుపురంగులో ఉన్న నోట్లకు పూశారు. అవి అసలైన నోట్లుగా మారకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ, ఇంఛార్జ్ సీఐల ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఉపయోగించిన ఆటో, బైక్, నలుపురంగు కట్టలను స్వాధీనం చేసుకున్నారు.