చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలను ఎలాంటి వివరాలు తెలుసుకోకుండానే ఏజెంట్ చెప్పిన విషయాలతో కొనుగోలు చేస్తుంటారు. కానీ, పాలసీ కొన్నాక అందులోని విషయాలు తెలుసుకుని నచ్చకపోతే ఏమి చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. పూర్తి వివరాలు తెలుసుకునేలోపే తిరిగి ఇచ్చేందుకు ఉన్న గడువు ముగుస్తుంది. దీంతో కచ్చితంగా అదే పాలసీలో కొనసాగాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్రం కొత్త రూల్స్ తీసుకొస్తోంది.
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఈ మేరకు ఫ్రీ లుక్ పీరియడ్ (పాలసీ తిరిగి ఇచ్చే సమయం) పెంచాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ఫ్రీ లుక్ పీరియడ్ 15 రోజులుగా ఉండగా.. దానిని 30 రోజులకు పెంచాలని పేర్కొంది. ఫ్రీ లుక్ పీరియడ్ అంటే కొత్తగా కొనుగోలు చేసిన పాలసీ నచ్చకపోతే ఎలాంటి సరెండర్ ఛార్జీలు చెల్లించకుండానే తిరిగి ఇచ్చేందుకు ఉన్న సమయం. ఈ క్రమంలో ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనల్లోని కీలక అంశాలు, అది ఎలా ప్రభావితం చేయనుంది అనే విషయాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలు తమ కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలపై 15 రోజుల ఫ్రీ లుక్ పీరియడ్ కల్పిస్తున్నాయి. అయితే, అది ఎలక్ట్రానికి మోడ్ పాలసీ లేదా డిస్టాన్స్ మోడ్ పాలసీ అయితే ఈ పీరియడ్ 30 రోజులుగా ఉంటుంది. అయితే, కచ్చితంగా అనేది ఏమీ ఉండదు. ఫ్రీ లుక్ పీరియడ్ 30 రోజుల వరకు కల్పించేందుకు చట్టాలు అవకాశం కల్పిస్తున్నాయి. పాలసీదారుల భద్రత, ఇన్సూరర్స్ రెగ్యులేషన్స్ చట్టం 2024 ప్రకారం.. ఇన్సూరెన్స్ పాలసీలు ఏ పద్ధతిలో తీసుకున్నా ప్రీ లుక్ పీరియడ్ అనేది పాలసీ డాక్యుమెంట్ తీసుకున్న తేదీ నుంచి 30 రోజులగా ఉండాలని ప్రతిపాదించింది.
ఇలా ఫ్రీ లుక్ పీరియడ్ పెంచడం ద్వారా పాలసీ డాక్యుమెంట్ లోని వివరాలను పూర్తిగా చదివి తెలుసుకునేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. పాలసీ కొనుగోలు చేసిన తర్వాత డాక్యుమెంట్ లోని కొన్ని క్లాజులు తమకు అనుగుణంగా లేవని భావించినప్పుడు ఈ ఫ్రీ లుక్ పీరియడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఫ్రీ లుక్ పీరియడ్ ద్వారా మీ పాలసీని తిరిగి ఇచ్చేడం లేదా మీకు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సమయం కల్పిస్తుంది. ఈ ఫ్రీ లుక్ పీరియడ్ లో మీరు పాలసీని రద్దు చేసుకున్నట్లయితే మీరు ఎలాంటి సరెండర్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ మీ ప్రీమియం డబ్బులను మీ రిఫండ్ చేస్తుంది.