ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పొలిటికల్ మూవీల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల వైఎస్ జగన్ జీవితచరిత్రలోని ఓ భాగాన్ని కథాంశంగా తీసుకుని చిత్రించిన యాత్ర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత అమరావతి రైతుల కథతో రాజధాని ఫైల్స్ అంటూ మరో మూవీ రిలీజైంది. ఇక ఫిబ్రవరి 23న రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన వ్యూహం సినిమా రాబోతోంది. ఆ వెంటనే మార్చి ఒకటో తేదీ శపథం రానుంది. అయితే ఈ సినిమాలపై గతకొంతకాలంగా సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తమ నాయకులను ఇందులో అభ్యంతరకరంగా చూపించారంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఈ సినిమాల విడుదలను అడ్డుకున్నాయి. కోర్టును సైతం ఆశ్రయించాయి. అయితే కోర్టు అనుమతితో వ్యూహం, శపథం సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే తన సినిమాలపై వస్తున్న అభ్యంతరాలు, విమర్శలకు బదులిచ్చారు ఆర్జీవీ. సోషల్ మీడియాలో ఈ సినిమాలపై జరుగుతున్న ప్రచారం, ఇతర పార్టీల నుంచి వస్తున్న విమర్శలకు ఓ వీడియో ద్వారా సమాధానం ఇచ్చారు. ఎప్పటిలాగే తనదైన పంచులతో వీడియోలో విరుచుకుపడిన ఆర్జీవీ.. తాను పొద్దున్నే పోర్న్ చూసినట్లు టీడీపీ, జనసేన నేతలు కూడా తన సినిమాలను బాత్‌రూమ్‌లో కూర్చుని చూస్తారని అన్నారు. ఇష్టం ఉన్నవాళ్లు చూడండి.. లేదంటే మానేయండి అంటూ తన మార్క్ పంచ్‌తో వీడియోను ఎండ్ చేశారు.
"బాక్సింగ్ రింగులోకి ఎంటరైతే గట్టిగా గుద్దాలి. అంతే కానీ జుట్టుపీకుతా, చెంపగిల్లుతా అంటే కుదరదు. నేనేమీ యాత్ర 2 సినిమా గురించి చెప్పట్లేదు. నిజాన్ని బట్టలిప్పి నగ్నంగా చూపించాలనేదే నా ఉద్దేశం. వ్యూహం, శపథం సినిమాలు పొలిటికల్ మూవీలు, టీడీపీ, జనసేన వాళ్లు చూస్తారా అనే వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. సికింద్రాబాద్‌లో చాలా ఏళ్ల క్రితం లంబా థియేటర్ ఉండేది. అందులో ఆడేవన్నీ ఆ సినిమాలే. అయితే ఇష్టమున్నా సరే.. ఆ థియేటర్‌కు పోవాలంటే జనం భయపడేవాళ్లు. పోయేవాళ్లు కాదు. కానీ అందులో ఆడే సినిమాలు ఎక్కడో అక్కడ చూసేవాళ్లు. నేను ఉదయాన్నే పోర్న్ చూసినట్లు టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు కూడా వ్యూహం, శపథం సినిమాను బాత్‌రూమ్‌ల్లో చూస్తారు. న్యూట్రల్‌గా ఉండేవాళ్లు లివింగ్ రూమ్‌లో కూర్చుని చూస్తారు. మీకిష్టమైతే ఈ సినిమాలు చూడండి.. లేదంటే మానేయండి" అని తనదైన స్టైల్లో చెప్పారు ఆర్జీవీ.