అన్యాయం జరిగితే చెప్పుకునేందుకు బాధితులు కోర్టులను ఆశ్రయిస్తారు. అక్కడ ఉండే జడ్జిలే న్యాయ నిర్ణేతలుగా తమకు న్యాయాన్ని అందిస్తారని.. తమకు అన్యాయం చేసిన వారికి శిక్షలు వేస్తారని భావిస్తారు. కానీ అలాంటి చోటే న్యాయం జరగకపోతే బాధితులు ఎక్కడికి వెళ్లాలి. న్యాయం చేయాల్సిన వారే అన్యాయం చేస్తే వారి గోడు చెప్పేది ఎవరికి. వారికి న్యాయం అందించవారు ఎవరు. ఎందుకు ఇలాంటి మాటలు అనుకుంటున్నారా. నాకు అన్యాయం జరిగింది బాబు.. కొంచెం న్యాయం చేయండి. నన్ను బలవంతం చేసిన వాడికి శిక్ష వేయండి అని ఓ అత్యాచార బాధితురాలు కోర్టును ఆశ్రయించగా.. ఆ కోర్టులోనే బాధితురాలిపై జడ్జి లైంగిక వేధింపులకు దిగడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
త్రిపురలోని కమాల్‌పూర్ పట్టణంలో ఉన్న ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ కోర్టులో ఈ సంఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌పై ఓ అత్యాచార బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునేందుకు వెళ్లగా.. ఆ జడ్జి తనపై లైంగిక వేధింపులకు దిగారని మహిళ ఆరోపించింది. తనపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన కేసులో బాధితురాలిగా వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు మెజిస్ట్రేట్ ఛాంబర్‌లోకి వెళ్లగా.. ఆ జడ్జి ఒక్కసారిగా తన వద్దకు వచ్చి లైంగికంగా వేధించారని మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆ జడ్జి ఛాంబర్ నుంచి వెంటనే బయటికి పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఉన్న లాయర్లు, తన భర్తకు జరిగిన విషయాన్ని చెప్పినట్లు బాధితురాలు పేర్కొంది.
ఈ ఘటనపై అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి, కమాల్‌పూర్ బార్ అసోసియేషన్‌కు ఆ అత్యాచార బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇదే విషయంపై ఆమె భర్త కూడా కమాల్‌పూర్ బార్ అసోసియేషన్‌కు మరో ఫిర్యాదు ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఈ నెల 16 వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. విచారణ కోసం కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌పై వచ్చిన ఈ ఆరోపణలపై ధలై జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి గౌతమ్ సర్కార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్ విచారణ మొదలు పెట్టింది. విచారణలో భాగంగా కమాల్‌పూర్‌లోని అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టును ముగ్గురు సభ్యులు సందర్శించి ఈ ఘటనపై విచారణ జరిపారు. బాధిత మహిళ చేసిన ఆరోపణలపై బార్ అసోసియేషన్ అభిప్రాయాలు, పరిశీలనలను నమోదు చేసుకుంది.
ఇక ఈ అంశంపై ఇప్పటిదాకా తమకు అధికారిక ఫిర్యాదు ఏదీ అందలేదని త్రిపుర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వి.పాండే స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల మాదిరిగానే, తాను కూడా వార్తల ద్వారానే ఈ ఘటన గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. సరైన ఫార్మాట్‌లో ఫిర్యాదు అందితే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.