తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులకు భారీ విరాళం అందింది. బెంగళూరుకు చెందిన యాక్సిస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు చెందిన ట్రస్టులకు రూ. 43 లక్షలు విరాళంగా అందించారు.తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి విరాళానికి సంబంధించిన చెక్కులను వర్ధమాన్ జైన్ అందించారు.శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 33. 33 లక్షలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ ట్రస్టుకు రూ. 10.11 లక్షలను విరాళంగా అందించారు.
మరోవైపు మంగళవారం పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, హోమ్ అఫైర్స్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్ లాల్‌తో పాటు కమిటీ సభ్యులు, త్రిపుర మాజీ సీఎం విప్లవ్ కుమార్ దేవ్, సినీ నటి సుహాసిని, కమెడియన్ రఘు, హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ ఓ మోస్తారుగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం మంగళవారం ఉదయం వరకూ 20 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక సర్వదర్శనం కింద స్వామివారిని దర్శించుకునే భక్తులకు సుమారు 14 గంటల సమయం పడుతోంది. సోమవారం ఒక్కరోజే 64 వేల741 మంది భక్తులు ఆ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. 24,667 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోగా.. సోమవారం నాడు హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.