ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే అనకాపల్లిలో జరిగిన శంఖారావం సభలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై నారా లోకేష్ సెటైర్లు వేశారు. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్ర ప్రదేశ్ పరువు తీసిన గుడివాడ అమర్‌నాథ్‌కు కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నానన్న లోకేష్.. గుడ్డును గిఫ్టుగా పంపుతున్నానని అన్నారు. బహిరంగ సభలోనే గుడ్డును చూపిస్తూ లోకేష్ సెటైర్లు వేశారు. అయితే నారా లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన అమర్‌నాథ్.. నారా లోకేష్‌కు పప్పును రిటర్న్ గిఫ్ట్ పంపుతున్నానని ఎద్దేవా చేశారు.
" నారా లోకేష్ ఎంతగానో ఇష్టపడే పప్పును మట్టికుండలో పెట్టి పంపుతున్నా. ఈ ప్రాంత మట్టితో తయారుచేసిన కుండలో పెట్టి పంపిస్తా. ఎవరైనా సాహసం చేసి తీసుకెళ్తే తీసుకెళ్లవచ్చు. లేదా తనకు ఇష్టమైన పప్పు కోసం లోకేష్ స్వయంగా వచ్చి తీసుకెళ్తానన్నా నాకు ఓకే. కేవలం పప్పు మాత్రమే కాదు. కొంచెం ఉప్పూకారం కూడా వేశా. ముద్దపప్పు మాత్రమే సరిపోదని ఉప్పూకారం వేశా. ఉత్తరాంధ్ర గురించి ఏనాడూ ఆలోచించని చంద్రబాబు, లోకేష్‌కు ఈ ప్రాంతం ఉప్పూకారం వేసిన పప్పు తినిపిస్తే సిగ్గు, విశ్వాసం కలుగుతాయని అనుకుంటున్నా" అంటూ గుడివాడ అమర్‌నాథ్ సెటైర్లు వేశారు.
ఇక తానేమీ లోకేష్ మాదిరి బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదన్న గుడివాడ అమర్‌నాథ్.. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వలన మంత్రి అయ్యానని చెప్పుకొచ్చారు. లోకేష్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. విస్సన్నపేట భూముల కుంభకోణం అంటూ ఏదేదో అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్న అమర్నాథ్.. పవన్ కళ్యాణ్ అక్కడకు వెళ్లి ఏం సాధించాడని ప్రశ్నించారు. తనపై ఆరోపణలు చేస్తున్న లోకేష్ , చంద్రబాబు.. ఉత్తరాంధ్ర కోసం ఏం చేశారని ప్రశ్నించారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క పోర్టు కట్టాలని ఏమైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో పొత్తులపైనా గుడివాడ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీయే కూటమిలో చేరబోతున్నాయని, అన్ని పార్టీలు కలిసి ఎన్నికలు వస్తాయని చెప్పారు.ఎవరు ఎవరితో కలిసి వచ్చినా వైసీపీ సింగిల్ గానే వస్తుందని.. తమ విధానంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగితే ఎవరికి సీట్లు ఇవ్వాలనేదీ చంద్రబాబు డిసైడ్ చేస్తారన్న గుడివాడ అమర్‌నాథ్..నాగబాబు అయినా ఇంకో బాబైనా వారి సీటు చంద్రబాబు డిసైడ్ చేస్తారంటూ ఎద్దేవా చేశారు.