ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గాలకు ఇంఛార్జుల ప్రకటన, ఇంఛార్జుల మార్పులతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అలాగే సీట్ల దక్కవనే భయంతో కొంతమంది నేతలు, పార్టీ మీద అసంతృప్తితో మరికొంతమంది లీడర్లు గోడ దూకేస్తున్నారు. ఈ క్రమంలోనే నూజివీడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథిని తెలుగుదేశం పార్టీ నియమించింది. అయితే నిన్నటి వరకూ నూజివీడు టీడీపీ ఇంఛార్జిగా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు.. సోమవారం వైఎస్ జగన్ కలిశారు. ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిని టీడీపీ ఇంఛార్జిగా నియమించడం విశేషం.
వాస్తవానికి కొలుసు పార్థసారథి టీడీపీలో చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో పెనమలూరు టికెట్ పార్థసారథికి ఇచ్చేందుకు వైసీపీ అధిష్టానం నిరాకరించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను కాదని మంత్రి జోగి రమేష్‌ను.. జగన్ పెనమలూరు వైసీపీ ఇంఛార్జిగా నియమించారు.దీంతో అసంతృప్తికి గురైన పార్థసారథి సైకిలెక్కాలని నిర్ణయించారు. అనంతరం టీడీపీ అధిష్ఠానాన్ని సంప్రదించడంతో పెనమలూరు నుంచి పార్థసారథి అభ్యర్థిత్వంపై చంద్రబాబు ఐవీఆర్ఎస్ సర్వే సైతం జరిపినట్లు సమాచారం. అయితే పెనమలూరు టీడీపీ ఇంఛార్జిగా ఉన్న బోడె ప్రసాద్ వర్గం పార్థసారథి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది.
దీంతో పార్థసారథిని నూజివీడు నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్టీలో చేరకుండానే నూజివీడులో టీడీపీ శ్రేణులతో పార్థసారథి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పార్థసారథిని నూజివీడు నుంచి పోటీ చేయించాలనే అధిష్ఠానం నిర్ణయాన్ని స్థానిక టీడీపీ ఇంఛార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇన్నిరోజులు కష్టపడిన తనకు కాకుండా పార్థసారథికి అవకాశం ఇవ్వాలనుకోవటంపై మండిపడ్డారు. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. నిర్ణయాన్ని మార్చుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
అయితే సోమవారం అనూహ్యంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను ముద్రబోయిన వెంకటేశ్వరరావు కలిశారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందంటూ జగన్‌కు వివరించారు. నూజివీడు నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. టీడీపీ ఇంఛార్జి కాస్తా వైసీపీ అధినేతను కలవడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం సైతం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంఛార్జి బాధ్యతల నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావును తప్పించి.. ఆయన స్థానంలో కొలుసు పార్థసారథిని నియమించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయడు ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నేత వైసీపీలోకి.. వైసీపీ నేత తెలుగుదేశంలోకి జంప్ చేసి బరిలో నిలిచే ప్రయత్నాల్లో ఉండటం ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.