పదవీ విరమణ పొందిన ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగుల కోసం రెండు ఆరోగ్య పథకాలను ఏపీ ప్రభుత్వం వర్తింపజేయనుంది. జనవరి 1, 2020 నాటికి రిటైర్డ్ అయిన వారికి రిటైర్డ్ ఉద్యోగుల మెడికల్ స్కీమ్ ను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడికల్ స్కీమ్ ద్వారా.. దాదాపు 25 వేల మంది ఉద్యోగులకు ఆరోగ్య సేవలు అందనున్నాయి. ఇదే సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైన తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా ఆరోగ్యసేవలు అందించనున్నారు. మరోవైపు.. ఈహెచ్ఎస్ పరిధిలోకి కడప, విజయవాడ ఆర్టీసీ ఆస్పత్రులను ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.
మరోవైపు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వ నిర్ణయంతో విలీనానికి ముందు రిటైర్డ్ అయిన సుమారు 25 వేల మందికి ఉపయోగం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పరిధిలోకి కడప, విజయవాడ ఆస్పత్రులను కూడా చేర్చటంతో ఆ ప్రాంతంలోని రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనాలు కలుగుతాయని చెప్తున్నారు.
మరోవైపు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రంగు మారుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సుల రంగులు మారుతున్నాయి. గతంలో సూపర్ లగ్జరీ బస్సుకు పసుపు, తెలుపు, ఎరుపు రంగులు ఉండేవి. ప్రస్తుతం వాటి స్థానంలో నీలం, లేత ఊదా, లేత నీలం రంగులు వేస్తున్నారు. అలాగే అల్ట్రా డీలక్స్ బస్సులు గతంలో ఊదా, నీలం, తెలుపు రంగుల్లో ఉండగా.. ఇప్పుడు తెలుపు, నీలం, ఆరెంజ్ రంగుల్లోకి మార్చారు. విజయవాడ విద్యాధరపురంలోని ఆర్టీసీ వర్క్‌షాపు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో 30 కొత్త బస్సులను సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని ప్రారభించనున్నట్లు అధికారులు తెలిపారు.