పల్నాడు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వాలంటీర్ వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే..పాలపాడులో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన అక్కా, చెల్లిని వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి గత కొద్దికాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. తల్లిదండ్రులు ఈ సమస్యను ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద కూతురికి ట్రిపుల్ ఐటీ సీటు వచ్చినా.. శ్రీకాంత్ రెడ్డి వేధింపులకు భయపడి తల్లిదండ్రులు కాలేజీకి కూడా పంపకుండా పూర్తిగా చదువు మాన్పించేశారు.దీంతో శ్రీకాంత్ రెడ్డి చెల్లిని కూడా టార్గెట్ చేశాడు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వేధిస్తున్నాడు. దీంతో ఆ వేధింపులు భరించలేక యువతి ఇవాళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.