రాష్ట్రంలో సొంతిల్లు లేని సామాన్య, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను సీఎం వైయస్ జగన్ నెరవేర్చారని, అందరినీ ఒక ఇంటివారిని చేశారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం సోనియానగర్‌లో నిర్మించిన 448 టిడ్కో ఇళ్లను రూ.1కే లబ్ధిదారులకు అందజేశారు. అందుకు సంబంధించిన పట్టా, ఇంటి తాళాలను వారి చేతికి ఇచ్చారు. దీంతో పట్టలేని సంతోషంతో లబ్ధిదా రులు సీఎం వైయస్ జగన్ కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లను ఇస్తామని ఒక్కో లబ్ధిదారుతో రూ.500 చొప్పున డీడీ తీయించారని, రూ.5 లక్షల బ్యాంకు రుణానికి అంగీకరింపజేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఆ ఇబ్బందులన్నీ లేకుండా ఒక్క రూపాయికే టిడ్కో ఇల్లును అందించిందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఏ ఒక్కరి నుంచి డబ్బు వసూలు చేయలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులతో అన్ని పనులు పూర్తిచేసి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు.