ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో 2, 3 రోజుల్లో అరెస్ట్ అవుతారని.. ఆ రాష్ట్ర మంత్రులు, ఆప్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. అందులో భాగంగానే ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే గతంలో ఈడీని ప్రయోగించినా ఎలాంటి ఉపయోగం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా సీబీఐని ప్రయోగిస్తోంది.. మరో 2, 3 రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని.. దానికి సంబంధించి తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత గోపాల్ రాయ్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు ఇప్పించి.. ఆయన్ను అరెస్ట్ చేయించాలని బీజేపీ కుట్రలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం సీబీఐ నోటీసులు కూడా సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేసినప్పటి నుంచి బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారుల ద్వారా నోటీసులు ఇప్పించి.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలని అధికార బీజేపీ ప్లాన్ చేస్తోందని గోపాల్ రాయ్ ఆరోపించారు. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు సిద్ధం చేసినట్లు తమకు సమాచరం అందిందని పేర్కొన్నారు.
గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ నోటీసుల ద్వారా అరవింద్ కేజ్రీవాల్‌ను ఏమీ చేయలేకపోయారని. ఇప్పుడు సీబీఐని రంగంలోకి దించి ఆ సంస్థను కూడా దుర్వినియోగం చేయాలని ప్రణాళికలు వేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఇళ్లు, వారితో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో ఇప్పటివరకు ఎన్నోసార్లు తనిఖీలు చేశాయని.. కానీ అవినీతి జరిగినట్లు ఒక్క ఆధారాన్ని కూడా గుర్తించలేకపోయాయని గోపాల్ రాయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు తమ పార్టీ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు.
ఇండియా కూటమిలో భాగంగానే తాము వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని.. అలా చేయకుండా తమను ఎవరూ ఆపలేరని గోపాల్ రాయ్ వ్యాఖ్యానించారు. ఇక ఆప్-కాంగ్రెస్ పొత్తుతో బీజేపీకి భయం పట్టుకుందని.. మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఆప్-కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు తుది దశకు చేరుకోగానే.. కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు ఏడోసారి నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. తొందర్లోనే కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చి.. అరెస్టు చేయనున్నారని తెలిపారు. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసినా.. కాంగ్రెస్‌తో పొత్తు మాత్రం ఉంటుందని స్పష్టం చేశారు. ఇక కేజ్రీవాల్‌ను సీబీఐ అదుపులోకి తీసుకుంటే ప్రజలు సునామీలా రోడ్లపైకి వస్తారని మరో నేత సందీప్ పాథక్ అన్నారు.