కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య నిత్యం ఏదో ఒక అంశంపై రగడ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్‌ను హిందుత్వ వ్యతిరేక పార్టీ, ప్రభుత్వం అని ఆరోపిస్తున్న బీజేపీకి తాజాగా మరో అస్త్రం దొరికింది. కర్ణాటకలోని దేవాలయాలపై పన్ను విధించే బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం కర్ణాటకలోని కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు.. తమకు వచ్చే ఆదాయం నుంచి 10 శాతం ప్రభుత్వానికి చెల్లించాలని చట్టం చేశారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ బిల్లు హిందూ వ్యతిరేక విధానం అని బీజేపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. హిందూ ఆలయాలపై పన్ను ఎందుకు అని ప్రశ్నించింది. అయితే బీజేపీ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ధార్మిక పరిషత్ కోసమేనని స్పష్టం చేస్తున్నారు.
దేవాలయాలపై పన్ను విధించే బిల్లును ప్రవేశపెట్టిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్ర అసెంబ్లీలో దానికి బుధవారం ఆమోదముద్ర కల్పించింది. ఈ కర్ణాటక టెంపుల్ టాక్స్ బిల్ ప్రకారం రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు తమ ఆదాయంలో 10 శాతం ప్రభుత్వానికి చెల్లించాలని పేర్కొన్నారు. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఈ బిల్లు ద్వారా సిద్ధరామయ్య సర్కార్ ఖజానాను నింపుకోవాలని చూస్తోందని కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడియూరప్ప తీవ్ర విమర్శలు చేశారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల నుంచి మాత్రమే ఎందుకు ఆదాయాన్ని వసూలు చేస్తోందని యడియూరప్ప ప్రశ్నించారు. ఇతర మతాలకు చెందిన పవిత్ర స్థలాల ఆదాయంపై ఎందుకు దృష్టి సారించటం లేదని లక్షలాది మంది హిందూ భక్తుల మదిలో మెదులుతున్న ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు.
ఇక బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను అధికార కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. దేవాలయాల నుంచి వసూలు చేసే సొమ్ము ప్రభుత్వం తీసుకోదని.. కర్ణాటక రవాణా శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి పేర్కొన్నారు. దాన్ని ధార్మిక పరిషత్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తారని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వం కూడా ఇలాగే చేసిందని.. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఆదాయమున్న దేవాలయాల నుంచి 5 శాతం బీజేపీ ప్రభుత్వం వసూలు చేసిందని.. రూ. 25 లక్షలు దాటిన ఆదాయం ఉన్న ఆలయాల నుంచి 10 శాతం వసూలు చేశారని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన అర్చకులకు సహాయం, దిగువ తరగతి ఆలయాలను అభివృద్ధి చేయడం, అర్చకుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటం వంటి ధార్మిక పరిషత్ ముఖ్య ఉద్దేశాలని మంత్రి తెలిపారు.
ఇక ఈ బిల్లును ఆమోదించడంపై కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దిగజారుడుతనానికి ఈ బిల్లు ఒక మచ్చుతునక అని మండిపడ్డారు. డీకే శివకుమార్, సిద్ధరామయ్యల నేతృత్వంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మతపరమైన ఎండోమెంట్ బిల్లును తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణ కోసం హిందూ భక్తులు ఇస్తున్న విరాళాలను కాంగ్రెస్ ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకుంటోందని ఆరోపించారు. హిందూ భక్తుల సొమ్మును కర్ణాటక కాంగ్రెస్ ఏటీఎం మిషన్ లాగా వాడుకుంటోందని విమర్శించారు.