ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన జన్నత్ హుస్సేన్ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కొన్నేళ్లుగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున తిరుపతి జిల్లా సూళ్లూరుపేట కీర్తి ఎన్‌క్లేవ్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. 1977 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన... ఉత్తరప్రదేశ్‌లో లఖ్‌నవూ సమీపాన ఓ కుగ్రామంలో 1951లో రైతు కుటుంబంలో జన్మించారు. చిన్నతనం నుంచి సామాన్య జీవితం గడిపిన ఆయన 1977లో ఐఏఎస్ సాధించి ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాల్లో పనిచేశారు. నిజాయితీపరుడిగా, నిగర్విగా, అందరికీ అండగా ఉంటూ మంచిపేరు తెచ్చుకున్నారు. 1985-87లో నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్‌గా, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా సేవలందించారు. సాంఘిక సంక్షేమ శాఖ, విద్యుత్ శాఖలకు ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఎక్సైజ్ కమిషనర్‌గా ఉన్నప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపారు. వ్యాపారులను ఠారెత్తించారు. ఫలానా పోస్టింగ్ కావాలని ఏ ఒక్క సీఎంనూ అడుగలేదు. అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వర్తించారు. అందుకే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయినప్పుడు ఆయన్ను సీఎంవోలోకి తీసుకున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకం విధివిధానాల రూపకల్పనలో జన్నత్ ముఖ్య పాత్ర పోషించారు. రోశయ్య హయాంలో 2010 డిసెంబరు 31న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రిటైరయ్యారు. అనంతరం రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014లో రాష్ట్ర విభజన వరకు ఆ పదవిలో కొనసాగారు. పదవులు, పైరవీలకు దూరంగా ఆయనో ‘బ్రాండ్’గా ప్రఖ్యాతి పొందారు. రిటైరయ్యాక తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఆయన స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారులిద్దరూ విదేశాల్లో ఉండగా.. కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు. మృతదేహాన్ని బంధువులు హైదరాబాద్‌కు తరలించారు. శనివారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జన్నత్ మరణంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.