బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. ఓ ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు గానూ కవిత కోనసీమ జిల్లాలో పర్యటించారు. పి.గన్నవరం మండలం ముంగండ గ్రామదేవత ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగాకవితను చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. అమ్మవారి దర్శనానంతరం కవిత మాట్లాడుతూ.. ముత్యాలమ్మ తల్లి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని.. అలాంటి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం శుభపరిణామని చెప్పారు.
మరోవైపు బ్రిటీష్ హయాంలో కూడా ముంగండ గ్రామ ప్రజలు ఎంతో సాహసం చేసి దేవాలయాలను పరిరక్షించారని కవిత కొనియాడారు. ముత్యాలమ్మ తల్లి ముంగండ గ్రామాన్నే కాకుండా తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అమ్మవారి కృపతో కళకళలాడాలని ఆకాంక్షించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలను కవిత సందర్శించారు. నర్సరీలోని మొక్కల ప్రత్యేకతలు వాటి పెంపకం తీరుతెన్నులను నర్సరీ రైతులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో ఫోటోలు తీసుకున్నారు. అనంతరం పుల్లా చంటి నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం కూర్పును పరిశీలించారు.
అనంతరం విలేకర్లతో మాట్లాడిన కవిత.. కడియంలోని నర్సరీ రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని అన్నారు. హరితహారం పేరుతో కోట్లాది రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం మొక్కలను కడియం నర్సరీల నుండి కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఈ నర్సరీలు విస్తరించి ఉండటం అభినందనీయమన్నారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా కూడా.. కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తుంటాయన్నారు కవిత. కేసీఆర్ అమలు చేసిన హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణలోని కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే ఈ నర్సరీలో పలు రకాల మొక్కలు తమ గార్డెన్‌లో ఉన్నాయన్నారు. కవితకు నర్సరీ రైతులు పల్ల సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి, వెంకటేష్, వినయ్‌లు మొక్కను ఇచ్చి ఘన స్వాగతం పలికారు.