జనసేన పార్టీలో మాజీ మంత్రి చేరారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన సీనియర్నేత కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కండువా కప్పి కొత్తపల్లిని ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పవన్ ఆయనకు సూచించారు. కొత్తపల్లి చేరికతో పశ్చిమగోదావరిలో పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని.. రాజకీయాల్లో ఆయనకున్న అనుభవం జనసేన విజయానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989 ఎన్నికల్లో నర్సాపురం నియోజకవర్గంలో పోటీచేసి విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి నర్సాపురం నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు అక్కడ నుంచే విజయం సాధించారు.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో.. కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పార్టీలోకి వెళ్లారు. నర్సాపురం నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి ఎదురైంది.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలుపొందారు.
2014 ఎన్నికలకు ముందు కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి మాధవనాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల ఫలితాల తర్వాత సుబ్బారాయుడు తిరిగి టీడీపీలో చేరగా.. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కింది. 2019 ఎన్నికలకు ముందు సుబ్బారాయుడు మళ్లీ కాపు కార్పొరేషన్ పదవికి రాజీనామా చేసి.. ఆ వెంటనే జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువాను కప్పేసుకున్నారు.
కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్‌సీపీలో ఉన్నా.. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో వర్గపోరు తప్పలేదు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో పరిణామాలతో కొత్తపల్లి వైఎస్సార్‌సీపీకి దూరం జరిగారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుపై విమర్శలు చేయడంతో అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సుబ్బారాయుడు టీడీపీలోకి వెళతారని ప్రచారం జరిగినా.. చివరికి ఆయన జనసేన పార్టీలో చేరారు. మొదటి టీడీపీ ఆ తర్వాత ప్రజారాజ్యం, మళ్లీ కాంగ్రెస్, అక్కడి నుంచి వైఎస్సార్‌సీపీలో చేరారు. మళ్లీ టీడీపీలో చేరి పదవి వచ్చినా.. మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా జనసేన పార్టీలో చేరారు.. అంటే దాదాపు ఏపీలో ఉన్న ప్రధాన పార్టీల్లో చేరారు. సుబ్బారాయుడు నరసాపురం టికెట్ ఆశిస్తున్నారు.. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. మొదటి జాబితాలో ఈ నియోజకవర్గంపై ప్రకటన రాలేదు.. అయితే నరసాపురం టికెట్‌పై సుబ్బారాయుడు ఆశతో ఉన్నారు.