‘రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే. రాజధాని అమరావతే.. ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కేంద్రం నిధులిచ్చింది. రాష్ట్ర పార్టీ కూడా ఏకైక రాజధాని అమరావతేనని తీర్మానం చేసింది. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పండి’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ బీజేపీ శ్రేణులకు పిలుపిచ్చారు. మంగళవారం విశాఖపట్నంలో ప్రముఖలతో సమావేశమైన ఆయన.. విజయవాడలో కోర్ కమిటీ భేటీలో పాల్గొన్నారు. ఏలూరులో పోలింగ్ బూత్ ఏజెంట్లతో జరిగిన సభలోనూ ప్రసంగించారు. విజయవాడ సమావేశంలో ఓ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. ‘ప్రజా పోరు యాత్రకు వెళ్తుంటే రాజధాని ఏదని ప్రజలు అడుగుతున్నారు’ అని అన్నారు. దానికి స్పందించిన రాజ్‌నాథ్... రాష్ట్ర రాజధాని అమరావతేనని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో ఏర్పడబోయేది మన ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్యాలపై గట్టిగా పోరాడండి. ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని గట్టిగా ఎదుర్కోవడానికి పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలి. ప్రజా క్షేత్రం నుంచి సాగించే ఉద్యమాలు, ఆందోళనల ద్వారానే పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ప్రతి ఇంటికీ బీజేపీ కార్యకర్త వెళ్లాలి. ప్రధాని మోదీ ప్రతినిధిగా నమస్కారం చెప్పి కేంద్ర సంక్షేమ పథకాలను వివరించాలి.’ అని అన్నారు.