ఔషధాల తయారీలో ప్రపంచంలోకెల్లా భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి అన్నారు. గతంలో బల్క్ డ్రగ్స్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండేదని గుర్తుచేశారు. మంగళవారం నాడు గుంటూరు ,హిందూ కాలేజి సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఇంద్రసేనా రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడుతూ... 150 ఏళ్ల క్రితం సంస్కృతం నేర్పాలనే ఉద్దేశంతో హిందూ కళాశాలను స్థాపించారని చెప్పారు. 125 ఏళ్ల నుంచి స్కూలు, కళాశాలతో పాటు అనేక బ్రాంచ్‌లను విస్తరింపచేయటం ఆనందంగా ఉందని అన్నారు. యూనివర్సిటీలకు దీటుగా హిందూ కళాశాల నిర్వహించడం శుభ పరిణామమని చెప్పారు. ప్రస్తుతం బల్క్ డ్రగ్ ఇండస్ట్రీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారవుతోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మసీ రంగానికి ఎంతో ఆదరణ ఉందని తెలిపారు. ఫార్మసీ రంగంలో మరింతగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా విద్యాసంస్థలు ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనకు తగిన విధంగా పరిశోధనలు జరిగేలా విద్యాసంస్థలు కృషి చేయాలని ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.