రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వరుసగా ఐదో ఏడాది.. వైయస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మునుముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం వైయస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34, 288 కోట్ల రూపాయలను చెల్లించామని ఆయన తెలిపారు. మొత్తం 53. 58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎగొట్టిన బకాయిలను తామే చెల్లించామన్నారు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాం.. కానీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని పెంచి ఇచ్చామని తెలిపారు. రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని సీఎం వైయస్ జగన్ వెల్లడించారు.