ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ... మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయ జన్మనిచ్చిందన్నారు. మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు వచ్చి 33 సంవత్సరాలు గడిచాయన్నారు. 8 సార్లు పార్లమెంట్, 2 సార్లు అసెంబ్లీ, ఒకసారి ఎమ్మెల్సీకి పోటీ చేశామని, మాగుంట కుటుంబానికి అహం లేదు.. ఆత్మగౌరవం ఉందని.. గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తాడని ఆయన ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నామన్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తనకు జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలు అందించారని.. ఈ సందర్బంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిజేస్తున్నానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు.