ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి సమావేశం తెలుగుజన విజయకేతనం సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఇప్పటిదాకా పవన్ కల్యాణ్‌లో శాంతి, మంచితనం మాత్రేమ చూశారన్న జనసేనాని.. ఇకపై మరో పవన్ కళ్యాణ్‌ను చూస్తారంటూ హెచ్చరించారు. వైసీపీ గూండాయిజాన్ని సహించేది లేదని.. మక్కెలు విరగ్గొట్టి మడత మంచంలో పడేస్తామని వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్‌ను పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు వైసీపీ నేతలు పదే పదే తన పెళ్లిళ్లపై మాట్లాడటం మీద పవన్ కళ్యాణ్ ఘాటుగా రియాక్టయ్యారు. సీఎం జగన్ తన పెళ్లిళ్లపై చేస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానమిచ్చారు. తనతో స్నేహం అంటే చనిపోయే వరకూ ఉంటుందన్న పవన్ కళ్యాణ్.. శత్రుత్వం అవతలివాడు చనిపోయే వరకూ ఉంటుందని అన్నారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు అంటారంటూ మండిపడ్డారు. జగన్ పదేపదే తనకు నాలుగు పెళ్లిళ్లు అని విమర్శిస్తారన్న పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా సీఎం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక తానూ తెలుగు మీడియంలోనే చదువుకున్నానన్న పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతల్లా మాట్లాడేందుకు తనకు సంస్కారం అడ్డువస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు, జగన్‌ను అధఃపాతాళానికి తొక్కే వామనుడి పాదం అని అన్నారు. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణేకాదంటూ హెచ్చరించారు. పొత్తులో భాగంగానే 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నానన్న పవన్ కళ్యాణ్.. 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించిందని అన్నారు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారనీ.. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో తెలుస్తుందన్నారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలేనన్న పవన్ కళ్యాణ్.. అంకెలు లెక్కపట్టవద్దని విపక్షాలకు సలహా ఇచ్చారు. అలాగే తనకు సలహాలు ఇచ్చేవాళ్లు అవసరం లేదని.. యుద్ధం చేసేవాళ్లు కావాలని వ్యాఖ్యానించారు.
జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తా..
ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారన్న పవన్ కళ్యాణ్..జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తా మరిచిపోకు అంటూ హెచ్చరించారు. తాను ఒక్కడినేనంటున్న జగన్.. తనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా లాక్కున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జూబ్లిహిల్స్‌లో ఇల్లు కట్టుకున్న సమయం నుంచి జగన్ సంగతి తనకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును జైళ్లో వేస్తే బాధవేసిందన్న పవన్ కళ్యాణ్.. రాష్ట్ర బాగు కోసమే తాను కూటమిని ప్రతిపాదించినట్లు చెప్పుకొచ్చారు. జనసేన, టీడీపీ నేతలు సహకరించుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు.