ఏపీలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కొన్నిచోట్ల కిలో చికెన్ ధర రూ.300 పలుకుతోంది. కోళ్ల ఉత్పత్తి తగ్గడమే ప్రధాన కారణం అంటున్నారు.. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.5 పైనే పలుకుతోంది. కార్తీక మాసం సమయంలో కోడి మాంసం ధరలు భారీగా పడిపోయాయి. అప్పుడు కిలో రూ.130 నుంచి రూ.140 చొప్పునే అమ్మాల్సి వచ్చింది. దీంతో అధికశాతం కోళ్ల ఫారాల యజమానులకు అప్పట్లో నష్టాలే మిగిలాయి. ఈ భయంతో కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. తల్లికోళ్లను కూడా గిట్టుబాటు కాక అమ్మేశారు.. దీంతో ఉత్పత్తి తగ్గి, కోళ్లకు కొరత ఏర్పడడంతో ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి.
గత నెలలో కిలో చికెన్ ధర రూ. 180 పలికింది.. ఇప్పుడు రూ.300 పలకడంతో చికెన్ కొనడానికి జనాలు వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.300, స్కిన్‌తో రూ.260 వరకు అమ్ముతున్నారు. ఇక బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కు పైగా అమ్ముతున్నారు.. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు దండుకుంటున్నారు.. కిలో చికెన్ ధర రూ. 500 కు అమ్ముతున్నారు. మరోవైపు కోడి గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.5 పైనే పలుకుతోంది. పెరిగిన ధరల దృష్ట్యా కొందరు చిల్లర వ్యాపారులు.. ఒక్కో గుడ్డు రూ.8 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి.. సమ్మర్ వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.