తాడేపల్లి గూడెంలో బుధవారం జరిగిన ఉమ్మడి సభలో పవన్ కల్యాణ్ కాస్తంత ఉత్తేజభరితంగానే మాట్లాడుతూ కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. ఇంతకు ముందు జరిగిన తన ఓటమిని గుర్తు చేసుకున్నారు. పొత్తులో జనసేన ఎన్ని సీట్లు తీసుకోవాలి.. సీఎం పదవిని ఎలా పంచుకోవాలి అంటూ లేఖలతో సలహాలు ఇచ్చిన వారందరికి నర్మగర్భంగా మాట్లాడుతూ చెక్ పెట్టారు. ఆయన ఏమన్నారంటే.. ‘నాకు ఎవరి సలహాలు అక్కరలేదు. జగన్ వెనుక ఉన్న సమూహాలు మాత్రం తప్పు చేసినా దోపిడీ చేసినా ఆహా.. ఓహో అంటూ ఉన్నారు. వెనకేసుకొస్తున్నారు. కాని, సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటుందని నిరూపిస్తా. ఎవరికి ఎంత ఓపికో పరీక్షించుకోవాలి. నాతో నిలబడి.. నా వెంట నడిచేవారే నా వాడు. అంటూ పవన్ ఉద్వేగంగా మాట్లాడటంతో సభికులు నుంచి స్పందన లభించింది. ప్రత్యేకించి సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు, నేను రాష్ట్రం కోసమే కలిసి పని చేస్తామంటూ స్పష్టం చేశారు.