ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మార్ 1 నుంచి ఎండీయూ వాహనాల (రేషన్ షాపులు) ద్వారా ఉచితంగా జొన్నలు, రాగులతో పాటు మరో వస్తువును చేర్చింది. తాజాగా రూ.11లకు కేజీ రాగి పిండి అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే జొన్నలు, రాగులు, రాగి పిండి ప్యాకెట్లను పౌర సరఫరాల శాఖ రేషన్ డీలర్లకు చేరవేసింది. మార్చి 1 నుంచి 16వ తేదీ వరకు ఎండీయూ వాహనాల ద్వారా ఆయా ఆహార పదార్థాలను కార్డుదారులు పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను అందజేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
అందుకే పౌరసరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెలా బియ్యం, కందిపప్పు, చక్కెరను అందజేస్తోంది. అలాగే ఆరు నెలలుగా రాగులను కూడా అందుబాటులో ఉంచింది. ఒక కుటుంబం మూడు కేజీల వరకు రాగులు తీసుకుంటే వారి కోటాలో వచ్చే బియ్యంలో మూడు కేజీలు తగ్గిస్తారు. అలాగే పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజలకు జొన్నలు అందించాలనే లక్ష్యంతో పౌరసరఫరాల సంస్థ రైతులనుంచి జొన్నలను సేకరించింది. మార్చి నుంచి ప్రతి రేషన్‌కార్డుకు కేజీ నుంచి మూడు కేజీల వరకు జొన్నలను పొందవచ్చు. ఇక్కడ కూడా బియ్యానికి బదులుగా జొన్నలు తీసుకోవచ్చు.
అలాగే మార్కెట్‌లో కేజీ రూ.40 విలువ చేసే రాగి పిండిని కూడా మార్చి నుంచి పేదలకు అందుబాటులోకి తెచ్చింది. అయితే కేజీ రాగి పిండి కోసం రూ.11 చెల్లించాల్సి ఉంటుంది. రాగి పిండి తీసుకుంటే బియ్యం వాటాలో కేజీని తగ్గిస్తారు. మార్చి నుంచి పౌరసరఫరాల సంస్థ ద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు పౌష్టిక ఆహారాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రాగి పిండిలో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2006 నిర్దేశిత ప్రమాణాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రజా పంపింణీ వ్యవస్థ అధికారులు తెలిపారు. ముందుగా పల్లెప్రాంత ప్రజలకు, తర్వాత పట్టణ ప్రజలకు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ రాగి పిండిని ముందుగా ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో సరఫరా చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం.. అలాగే రాయలసీమలో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల్లోని రేషన్ దుకాణాలకు రాగి పిండి సరఫరా చేస్తారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో అందుబాటులోకి తెస్తారు.