ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేక హోదా తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారని, ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని జగన్ మాయ మాటలు చెప్పారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా శుక్రవారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 22 మంది ఎంపీలను గెలిపిస్తే హోదాపై పార్లమెంట్‌లో ఒక్క మాట మాట్లాడలేదని ఆరోపించారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలుగా తాము పోరాటం చేసామన్నారు. వైసీపీ ప్రభుత్వం లో ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు.ఎన్నికల నేపథ్యంలో మెగా డిఎస్సీ కి బదులు దగా డీఎస్సీ తీశారని, అధికారం వుందికదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. ఐదేళ్లలో ఒక్క యువకుడికీ ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఉపాధి కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, కీయా, సెల్ కాన్ వంటి సంస్థలు తెచ్చామన్నారు. వైసీపీ పాలనలో కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్నవి తరిమేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ వైఖరి కారణంగా లులూ మాల్, ఆధాని డేటా సెంటర్ వెళ్ళిపోయాయన్నారు. యువతను మళ్ళీ మోసం చేయటానికి సీఎం జగన్ కొత్త నాటకాలు ప్రారంభిస్తున్నారని, మూడు రాజధానుల పేరిట ప్రజలను మోసం చేశారని, ఏపీ నిరుద్యోగ, డ్రగ్స్, క్రైం కేపిటల్‌గా మారిందన్నారు. దేశంలో ఎక్కడా గంజాయి పట్టుబడ్డా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని, క్రిమినల్‌ను సీఎం చేసినందుకు రాష్ట్ర పరువు పోతోందని, పంజాబ్‌కు మించిన డ్రగ్స్ కేపిటల్‌గా రాష్ట్రం తయారయిందని రామ్మోన్ నాయుడు వ్యాఖ్యానించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో క్రిమినల్స్ రెచ్చిపోతున్నారని, ఓ దళితుణ్ణి హత్య చేసి డెడ్ బాడీని ఇంటికి పర్సల్ చేశారన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ జనసేన కూటమి రావాలన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్ అని, యువత ఆలోచించి భవిష్యత్ కోసం ఓటు వేయాలని పిలుపిచ్చారు. వైసీపీ నేతల ఒత్తిళ్లకు యువత లొంగవద్దని రామ్మోహన్ నాయుడు సూచించారు.