2014 ఎన్నికల ప్రచార సభలో పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ నాటి ప్రధాని అభ్యర్థి మోదీ వాగ్దానం చేశారని షర్మిల గుర్తు చేశారు. ‘‘ఆనాటి సభలో ఏపీని స్వర్ణాంధ్రగా మారుస్తామని మోదీ అన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టేందుకు సాయపడతామన్నారు. హార్డ్‌వేర్ హబ్‌గా తయారు చేస్తామని చెప్పారు. పెట్రోలియం పరిశ్రమలు తెస్తామన్నారు. ఒక్కటంటే ఒక్కమాటైనా నిలబెట్టుకోలేదు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశాన్నీ గాలికొదిలేశారు. పోలవరం పక్కన పెట్టేశారు. రాజధాని లేకుండా పోవడం బాధాకరం. విభజన చట్టంలో ఏపీకి రావలసిన హక్కులను ఒక్కటి కూడా సాధించుకోలేక పోయాం. రామభక్తుడినని చెప్పుకొనే ఆయన మూడు నామాల వాడికే పంగనామాలు పెట్టారు. ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన మోదీ కేడీ కాక ఇంకేమవుతాడు. మోదీ అంటేనే మోసం’ అంటూ షర్మిల ధ్వజమెత్తారు.