దేశంలోని సంపన్నుల కోసమే బీజేపీ పనిచేస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ విమర్శించారు. ‘‘ఇండియా కూటమితో పాటు బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలపై ఈడీ, సీబీఐలను కేంద్రం ఉసిగొలుపుతోంది. కేంద్రప్రభుత్వ అధికార దర్పంపై సోనియా, రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. కాంగ్రెస్ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇచ్చింది. క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.నాడు ఆర్థిక శాఖకు కూడా పంపించాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ అమలు చేయలేదు. నరేంద్ర మోదీ పదేళ్లు ప్రధానిమంత్రిగా ఉన్నారు. హోదా హామీని మాత్రం మరిచారు. ఈ రాష్ట్రాన్ని పాలించిన స్థానిక పార్టీలు కూడా హోదా సాధనలో విఫలమయ్యాయి. రైతులను, నిరుద్యోగులను బీజేపీ పూర్తిగా విస్మరించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్రానికి ఒక్క రూపాయి రాలేదు. మాటమీద నిలబడే తత్వం బీజేపీది కాదు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే చేసి తీరుతుంది. ఎన్నికల్లో ఆశీస్సుల కోసం వచ్చాం. ఏపీకి హోదా ఇచ్చి తీరుతాం’’ అని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. వైఎస్ బొమ్మతో అధికారంలోకి వచ్చిన జగన్ నేడు ఆయన ఫొటోనే దూరం చేశాడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కేసు నుంచి బయటపడేందుకు 12మందిని హత్య చేయించారని తీవ్ర విమర్శ చేశారు. ఫ్యాన్, సైకిల్, కమలం గుర్తులను ఊరిబయట పడేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.