ద్రావిడ విశ్వవిద్యాలయం శుక్రవారం మూతపడింది. ఐదు నెలలుగా వేతనాలివ్వలేదని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బంద్‌కు దిగడమే దీనికి కారణం. విశ్వవిద్యాలయంలో 254 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ఐదు నెలలుగా వేతనాలు అందలేదు. అయితే ఇటీవల వర్సిటీకి రూ.7.82 కోట్ల అడిషినల్ గ్రాంట్ వచ్చింది. ఇందులో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసమని ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించినా ఫలితం లేకపోయింది. ఇదేమని అడిగితే ఉన్నతాధికారుల నుంచి అనుమతి లేదని అధికారులు చల్లగా చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శుక్రవారం బంద్‌కు గురువారమే పిలుపునిచ్చారు. అయినా పట్టించుకోని అధికారులు బంద్ నోటీసులు ఖాతరు చేయకుండా శుక్రవారం పీజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను కొనసాగించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బంద్‌కు దిగారు. పీజీ పరీక్షలు జరుగుతున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆపించేసి, విద్యార్థులను బయటకు పంపేశారు. అధికారుల సమాచారంతో ఇద్దరు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లను తీసుకుని వర్సిటీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే అప్పటికే విద్యార్థులు పరీక్ష హాలునుంచి వెలుపలికి వచ్చేయడంతో పరీక్షలు రద్దయిపోయాయి. అనంతరం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తిరిగి వర్సిటీ ప్రధాన గేటు వద్దకొచ్చి ధర్నాకు దిగారు. వీసీ, రిజిస్ట్రార్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ దశలో పోలీసులు జోక్యం చేసుకుని, వర్సిటీ వీసీ కె.మధుజ్యోతిని, రిజిస్ట్రార్ వేణుగోపాల్‌రెడ్డిని పిలిపించారు. వారొచ్చి ఆందోళనకారులకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. రిజిస్ట్రార్ విజయవాడ వెళ్లి, అనుమతి తెచ్చేందుకు ప్రయత్నిస్తారన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పద్దు కింద ఉన్న మొత్తాన్ని ఈనెల 30వ తేదీదాకా వేరే ఖర్చులకు ఉపయోగించుకోబోమని హామీ ఇచ్చారు. సమస్యను తాత్కాలికంగా దాటవేయడానికి అధికారులు అబద్ధాలు చెబుతున్నారని, తమకు వేతనాలు వచ్చాకే సమ్మె విరమిస్తామని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్పష్టం చేశారు. ఐదు నెలలతోపాటు అంతకుముందు సమ్మె కాలమైన రెండు నెలలకు కలిపి ఏడు నెలలకు వేతనాలు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. ఎంత చెప్పినా వినకపోవడంతో అధికారులు మౌనంగా వర్సిటీలోకి వెళ్లిపోయారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన కొనసాగించారు.