అధికార బలంతో డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని మధు ఫంక్షన్ హాలులో డోన్ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఆత్మీయ సభలో కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో మైనింగ్ వ్యాపారులను మంత్రి బుగ్గన టార్గెట్ చేసి బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన అభివృద్ధి అంతా కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చుకోవడమే అని విమర్శించారు. బుగ్గన చేసిన ప్రతి పనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. డోన్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. డోన్ ఎప్పటికీ కేఈ, కోట్ల కుటుంబాల అడ్డా అని ఉద్ఘాటించారు. ఇక మా అడ్డాలో మీ అరాచకాలను సాగనివ్వమన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, అర్ధరాత్రి తలుపు తట్టినా తాము పలుకుతామని అన్నారు. బేతంచెర్ల మండలంలో మైనింగ్ వ్యాపారులను మంత్రి బుగ్గన ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుగ్గన పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. టీడీపీలో చేరాలని సింగిల్ విండో మాజీ చైర్మన్ వెంకటరెడ్డి వస్తోంటే.. వైసీపీ నాయకులు ఐదు వాహనాలతో అడ్డగించినా భయపడలేదన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు తాను అన్ని రకాలుగా అండగా ఉంటానన్నారు. డోన్‌లో టీడీపీ జెండాను ఎగురవేసి చంద్రబాబుకు కానుకగా ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు కోట్ల రాఘవేంద్రరెడ్డి, కోట్ల నివేదిత మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, మర్రి రమణ, దేవరబండ వెంకటనారాయణ, భాస్కర్ నాయుడు, ఎస్‌ఎండీ రఫి, కేఈ శ్యాం, రంజిత్ కిరణ్, దిలీప్ రెడ్డి, భూమా నాగన్న, భాష్యం శ్రీను, వలసల బాలుడు, హరిశంకర్ గౌడు తదితరులు ప పాల్గొన్నారు.