బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు కేసు ఇప్పుడు దేశమంతా సంచలనంగా మారింది. అయితే.. ఈ ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధారామయ్య స్పందించారు. ఈ కేసుపై ప్రస్తుతం సెంట్రల్ క్రైం బ్రాంచ్ దర్యాప్తు చేస్తోందని సిద్ధరామయ్య తెలిపారు. ఈ ఘటనకు కారణమైన నిందితుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోందన్నారు. ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. కీలక ప్రకటన చేశారు సిద్ధారామయ్య. అవసరమైతే ఈ కేసును ఎన్ఐఏ (NIA)కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని సిద్ధారామయ్య చెప్పారు. అవసరమైతే ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. బాంబు పేలుడు లాంటి ఘటనలు చిన్నవి కావని.. ఇటువంటి వాటిపై నేతలు రాజకీయ ప్రేరేపిత ప్రకటనలు చేయటం మానుకోవాలని.. బీజేపీ నాయకులను ఉద్దేశించి హితవు పలికారు. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బాంబు పేలుళ్లు జరిగాయని.. అలాంటి వాటిని తాము రాజకీయపరంగా వాడుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. మంగళూరులో 2022లో ప్రెజర్ కుక్కర్ పేలుడు ఘటన చోటుచేసుకుందని గుర్తు చేసిన సిద్ధారామయ్య.. దానికి తాజా ఘటనకు ఏమైనా సంబంధముందా.. అన్న కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్టు సీఎం తెలిపారు.
ఘటన జరిగిన రామేశ్వరం కేఫ్‌ని సీఎం సిద్ధరామయ్య పరిశీలించారు. అనంతరం.. ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ముఖానికి మాస్కు, క్యాప్ పెట్టుకున్న గుర్తుతెలియని వ్యక్తి.. బస్సులో వచ్చాడని.. కౌంటర్ నుంచి రవ్వ ఇడ్లీ కొని కేఫ్‌లో ఓ చోట కూర్చున్నట్టు... ఆ తర్వాత టైమర్ సెట్ చేసి వెళ్లిపోయినట్టుగా.. సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా.. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసి.. నిందితుడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని సీఎం సిద్ధారామయ్య వెల్లడించారు.