గుంటూరు జిల్లా, మంగళగిరిలో ఓ నిరుద్యోగి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఉద్యోగాల పేరుతో తనలాంటి నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. జగన్ ప్రభుత్వం తీరుకు నిరసనగా వైసీపీ జెండాలు చేతబట్టి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. తన నిరసనకు అభ్యంతరం తెలిపితే పాయిజన్ తాగుతానని హెచ్చరించాడు. వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ నిరుద్యోగులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సోమవారం సాయంత్రంలోగా మంత్రి సమాధానం ఇవ్వాలని లేని పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని నిరుద్యోగి మరోసారి హెచ్చరించాడు.రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన చేసిన నేపథ్యంలో 1998లో అర్హత సాధించినవారికి ఉద్యోగాలు ఇవ్వాలని యువకుడు డిమాండ్ చేశాడు. డీఎస్సీ 1998లో మిగిలిన 2 వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగి కోరాడు. తనను కాపాడేందుకు ఎవరైనా సెల్ ఫోన్ టవర్ ఎక్కేందుకు ప్రయత్నిస్తే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికలు జారీ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. కిందకు దిగమని యువకుడికి విజ్ఞప్తి చేశారు. అయితే ఈరోజు సాయంత్రంలోగా మంత్రి బొత్స సత్యనారాయణ లేదా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని.. అప్పటి వరకు తాను ఇక్కడే ఉంటానని, సాయంత్రంలోగా ప్రకటన రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మరోసారి హెచ్చరించాడు.