ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భారీ పరాజయం ఎదుర్కోనున్నారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) జోస్యం చెప్పారు. ఆయన రాజకీయ భవిష్యత్ క్షీణ దశలో ఉందని, తెలంగాణలో కేసీఆర్‌కు పట్టిన గతే ఆయనకూ పట్టబోతోందన్నారు. తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓట్లు వేసేటప్పుడు ప్రజలు అభివృద్ధికే ప్రాధాన్యమిస్తారని.. ఉచిత పథకాలకు కాదని స్పష్టం చేశారు. ‘యువత.. ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగాలు కోరుకుంటారు.. ఇతరత్రా ప్రయోజనాలు కాదు. ఉచితాలపైనే జగన్ పూర్తిగా ఆధారపడ్డారు. దీనివల్ల ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. మామూలు ఓటమి కాదు.. భారీ పరాజయం తప్పదు’ అని తేల్చిచెప్పారు. ప్రజలు సమర్థ నిర్వహణను చూస్తారని.. కేవలం వనరుల నిర్వహణను కాదని చెప్పారు. ప్రజాధనాన్ని ఖర్చుచేస్తూ వారి బాగోగులను చూస్తున్నామని భావిస్తే అది పొరపాటని. జగన్ ఇదే చేస్తున్నారని.. తెలంగాణలో కూడా కేసీఆర్ ఇదేచేసి దెబ్బతిన్నారని తెలిపారు. ఎన్నికల ఫలితాలను ధనబలం మాత్రమే నిర్ణయించగలదని అనుకుంటే.. ఏ ప్రభుత్వాన్నీ ఓడించలేరని స్పష్టం చేశారు.