తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను మార్చి 15 నుంచి 22 వరకు ఈ – వేలం వేయనున్నారు. కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 412 లాట్లు ఉన్నాయి. ఇందులో ఆర్ట్ సిల్క్ ధోతీలు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, దుపట్టాలు, శాలువలు, బెడ్ షీట్లు, నాప్ కిన్స్, హ్యాండ్ కర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్ మెటీరియల్స్, జంకాళాలు, కార్పెట్లు, గొడుగులు ఉన్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org / www.konugolu.ap.govt.in సంప్రదించాలని టీటీడీ సూచించింది.
శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాశాల గాత్ర విభాగం అధ్యాపకులు బి.చిన్నమదేవి శిష్య బృందం పలు సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. ఇందులో పాహిమాం శ్రీ .., నమో భూతనాథం .., చంద్రశేఖర.., వరలీల గాన లోల.. తదితర కీర్తనలతో కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి వయోలిన్ పై సంకీర్త్ కుమార్, కీబోర్డ్ పై భరద్వాజ, మృదంగం పై పూర్వ ప్రిన్సిపాల్ యం.సుధాకర్, తబలాపై కె.యస్.ఆర్. బుజ్జి సహకారం అందించారు. అనంతరం కళాశాల వయోలిన్ విభాగం అధ్యాపకులు డాక్టర్ పూర్ణ వైద్యనాథన్ గారి బృందం వయోలిన్ వాద్య కార్యక్రమం జరిగింది. శ్రీ నవీన్ కుమార్, శ్రీ యువరాజ్ వయోలిన్ మీద, డోలు మీద శ్రీ చంద్రశేఖర్ సహకారం అందించారు. ఆనంద నిటల ప్రకాశం.., పార్వతీ పతిం.., సభాపతికిదే.. మొదలైన కీర్తనలతో శ్రోతలను రంజింపజేశారు.
మార్చి 4న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన సోమవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక పుష్ప, విద్యుత్ దీపాలంకరణలు పూర్తి చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, పోలీస్ విభాగాల సమన్వయంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్ తో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుంచి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకు వెళతారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు ప్రారంభమవుతుంది. నగర వీధుల్లో ఊరేగింపుగా ఉదయం 11 గంటలకు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa