నవమాసాలు మోసిన కన్నతల్లి.. భుజాలపై ఎక్కించుకుని మోసిన తండ్రి. ఆస్తి కోసం అక్కసుతో దారుణంగా దాడి చేశాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని బి కొత్తకోట మండలం బయప్పగారిపల్లె పంచాయతీ గుంతవారిపల్లెకు చెందిన వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మలు మదనపల్లెలోని అయోధ్యనగర్‌లో ఓ కళ్యాణ మండపంలో పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు మనోహర్‌రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటుండగా.. చిన్న కుమారుడు శ్రీనివాసులురెడ్డి మదనపల్లెలోని భవానీనగర్‌లో చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ఈ కుటుంబానికి మూడెకరాల పట్టా, రెండెకరాల డీకేటీ భూమి ఉంది. ఆస్తి పంపకాల విషయంలో కొన్ని రోజులుగా శ్రీనివాసులురెడ్డి సోదరుడితో, తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 2న తల్లిదండ్రులతో ఘర్షణకు దిగి వృద్ధులనీ చూడకుండా దారుణంగా దాడి చేశాడు. తల్లి జుత్తు పట్టుకుని ఈడ్చుకెళుతూ పిడిగుద్దులు కురిపించాడు. వారించిన తండ్రి గుండెలపైనా తన్ని, చెంపలపై కొట్టాడు. తనను కొట్టొద్దని కొడుకును ఆ తల్లి వేడుకుంటున్నా.. కనికరం చూపకుండా తీవ్రంగా కొట్టాడు.
గుర్తుతెలియని వ్యక్తులు రికార్డు చేసిన ఈ సంఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు శ్రీనివాసులురెడ్డిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మదనపల్లె పోలీసులు స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ దంపతులను ప్రశ్నించారు. నిందితుడు శ్రీనివాసులురెడ్డిపై ఐపీసీ సెక్షన్ 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.