ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పెనుకొండలో సోమవారం సాయంత్రం రా కదలిరా ముగింపు సభ జరిగింది.దేనికి శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనాల్ని తరలించారు. ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జిగా ఉంటున్న పరిటాల శ్రీరామ్ కూడా జనాల తరలింపులో పోటీ పడ్డారు. అదే సమయంలో ధర్మవరం టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ కూడా జనాల తరలింపు చేపట్టారు. టీడీపీ సభకు బీజేపీ నేత జనాలని తరలించడం ఏమిటా అని ఎవరికైనా ఆశ్చర్యం కలగవచ్చు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన గోనుగుంట్ల సూర్యనారాయణ తన వ్యాపారాల పరిరక్షణ కోసం బీజేపీలో చేరారే తప్ప, ఆయన మనసు మాత్రం టీడీపీలోనే ఉంది. ఆయన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారో, బీజేపీ టికెట్ ఆశిస్తున్నారో తెలియదు కానీ, ధర్మవరం నుంచి తానే ఎమ్మెల్యేగా ఎంపిక కావాలని దృఢంగా కోరుకుంటున్నారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసేది మనమే, గెలిచేది మనమే, పైగా లక్ష ఓట్ల మెజారిటీ ఖాయం అంటూ పదేపదే ఆయన సెలవిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లిపోయారు. కేవలం తన వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఆయన బీజేపీ గూటికి చేరారే తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీతో అనుబంధాన్ని మాత్రం తెంచుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు వేయడం, వాటిని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ వర్గీయులు తొలగించడం వంటి సంఘటనలు నిన్న మొన్నటి వరకు జరిగాయి. తాజాగా సోమవారం చంద్రబాబు సభకు బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడానికి ప్రయత్నించారు. అయితే, బత్తలపల్లి సమీపంలో ఆయన వాహనాలపై రాళ్లు రువ్వి వారిని పరిటాల శ్రీరామ్ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
కళ్యాణదుర్గంలోనూ సోమవారం టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం తలెత్తింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిగా మాదినేని ఉమామహేశ్వరనాయుడు కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనను కాదని ఎస్ ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు టికెట్ ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలోని పలు చోట్ల ఆయన ఫ్లెక్సీలు వెలిశాయి. దీన్ని జీర్ణించుకోలేని ఉమా వర్గీయులు సోమవారం ఆయన ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని సురేంద్రబాబుకు టికెట్ ఇవ్వడం ఏమిటని ఉమా వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అభ్యర్థిని మార్చాల్సిందే నని వారు పట్టుబడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరితో కూడా చేతులు కలిపి మరీ అసమ్మతి రాజకీయాలకు మాదినేని ఉమా తెర తీయడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ నాయకత్వం వీటిని చక్క దిద్దకపోతే అభ్యర్థుల గెలుపుపై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి, పార్టీ నాయకత్వం ఏ మేరకు చొరవ తీసుకుంటుందో చూడాల్సి ఉంది.