ఎన్నికలు సమీపిస్తున్న వేళ భీమవరం పట్టణంలో రోడ్లపై పంచాయితీలు పెరి గాయి. ఎన్నికల కోడ్ రాక ముందే కొంత మంది బాహా బాహీకు దిగుతున్నారు. దీంతో రోడ్లుపై ప్రయాణించేవారు భయపడే పరిస్థితి నెలకొంది. కొన్ని రాజకీయ పార్టీల వారు కావాలనే కొందరిపై దాడులకు దిగటం సర్వసాధారణంగా మారింది. సాయంత్రం నుంచి అర్ధ రాత్రి వరకూ పూటుగా మద్యం సేవించినవారు రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతూ అవతలివారిని రెచ్చగొట్టడంతో తగాదాలు వస్తున్నాయి. చివరకు పోలీసుల వచ్చి పంచాయతీలు చేసి తిరిగి పంపేస్తున్నారు. రెండు రోజుల క్రితం భీమవరం పోలీస్ బొమ్మ సెంటర్‌లో ఇద్దరు ఆటో డ్రైవర్లు ఘర్షణకు దిగారు. చివరకు రాడ్లతో కొట్టుకునే పరిస్ధితి నెలకొనడంతో స్ధానికులు వారిని ఆపి సర్ధిచేసి పంపారు. అలాగే నెలరోజుల క్రితం బైపాస్ రోడ్డులోని ఒక మద్యం దుకాణం వద్ద కొందరు యువత బీరు సీసాలతో దాడి చేసుకుని తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. సుమారు 20 రోజుల క్రితం స్థానిక మెంటేవారితోటలో కొందరు యువత ఘర్షణకు దిగారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో పారిపోయారు.