దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం బుధవారం 9గంటలకు ప్రారంభించనున్నట్టు వేలం నిర్వహణాధికారి జీఎల్‌కే ప్రసాద్ తెలిపారు. మంగళవారం సాయంత్రం వేలం నిర్వహణ కేం ద్రంలో ఆయన మాట్లాడుతూ దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో 6.61 బిలియన్ కిలోల పొగాకుకు అనుమతి ఇవ్వగా 7.8 బిలియన్ కిలోలు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామన్నారు. అలాగే రాజమహేంద్రవరం రూరల్ మండలం తొర్రేడు ప్రాంతంలో పండించే బ్లాక్ సాయిల్ పొగాకు ఈ సంవత్సరం 1.8మిలియన్ కిలోలకు అనుమతి ఇవ్వగా 2.5మిలియన్ కిలోలు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామన్నారు. గత ఏడాది దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో సరాసరి కిలో ధర రూ.254.62 పైసలు ధర పలికిందని, గరిష్ట ధర రూ.287, కనిష్ట ధర రూ.160, బ్లాక్ సాయిల్‌లో సరాసరి రేటు రూ.201 అని గుర్తుచేశారు. పొగాకు వేలం ప్రక్రియ సజావుగా జరిగేందుకు రైతులు సహకరించాలని ప్రసాద్ కోరారు. పొగాకు బేలుకు రేటు నిర్ణయించడానికి కొన్ని సెకండ్ల ప్రక్రియ మాత్రమే ఉంటుందని, దీనికి సరైన వాతావరణం ఉండాలన్నారు. పొగాకు బేళ్లు వేలానికి తీసుకొచ్చే టప్పుడు అన్యపదార్థాలు ఉండకూడదని, తేమ శాతం తగిన విధంగా ఉండేలా చూసుకోవాలన్నారు. పొగాకు బేళ్లు 150 కిలోలకు మించి ఉండకూడదన్నారు. వేలం కేంద్రంలో సిబ్బంది కొరత ఉందని, ప్రస్తుతం ఉన్నవారితోనే సమర్థవంతం నిర్వహిస్తామని చెప్పారు.