‘బీసీలే దేశానికి వెన్నెముక. వారికి సాధికారత ఉండాలి. బీసీలు శాసించే స్థాయిలో ఉండాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల్లోనే బీసీల పొట్టకొట్టారని ఆయన ఆరోపించారు. టీడీపీ-జనసేన ఉమ్మడిగా మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. జగన్ మాటలు నమ్మి చాలామంది బీసీ నాయకులు వైసీపీలోకి వెళ్లారని, కానీ.. వారిని కూడా జగన్ మోసం చేశారని వ్యాఖ్యానించారు. ‘‘సీఎం జగన్ బీసీలకు ఏటా 15 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లల్లో బీసీ సంక్షేమానికి రూ.75 వేల కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బీసీ కేటగిరీల్లో 153 కులాలను గుర్తించి, 139 కార్పొరేషన్లు పెడతామన్నారు. కేవలం 56 కార్పొరేషన్లు పెట్టి.. వాటికి బడ్జెట్ కేటాయించకుండా, కనీసం కుర్చీలు కూడా లేకుండా చేశారు. చేయూత కింద 45 ఏళ్లు దాటి మహిళలకు రూ.75 వేలు ఇస్తామని లబ్ధిదారుల సంఖ్యలో కోత విధించారు. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు కానీ, ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తేలేదు. బడ్జెట్‌లో మూడోవంతు బీసీలకు కేటాయిస్తామని చెప్పి విస్మరించారు. వైసీపీ పాలనలో 23 వేల మంది బీసీలపై కేసులు పెట్టారు. 300 మంది బీసీలను చంపేశారు. అచ్చెన్నాయుడు వంటి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. వైసీపీలో ఒక్క బీసీ నాయకుడు కూడా ఈ అరాచకాలపై మాట్లాడలేదు. వైసీపీ అడ్డగోలు తనానికి ఆ పార్టీలోని బీసీ నేతలు అండగా నిలిస్తే తమ కులానికి ద్రోహం చేసిన వారవుతారు. ఈ సంఘటనలు చూసిన తర్వాత వైసీపీ పాలనలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని అర్థమవుతోంది. దీనికి నేను మనస్ఫూర్తిగా మద్ధతు తెలుపుతున్నాను’’ అని అన్నారు.