తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య తలెత్తిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆగ్రహంతో భర్త చెంపదెబ్బ కొట్టడంతో భార్య చనిపోయింది. డ్వాక్రా రుణం వాయిదా చెల్లింపు విషయంలో తలెత్తిన గొడవ ఆ ఇల్లాలి ప్రాణం తీసుకుంది. కొవ్వూరు మండలం మద్దూరు గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కొవ్వూరు మండలం మద్దూరు గ్రామానికి చెందిన సండ్ర వీరబాబు. లావణ్య సాయి దీపిక భార్యా భర్తలు. అయితే డ్వాక్రా సంఘంలో సభ్యురాలిగా ఉన్న లావణ్య.. సంఘం తరుఫున అప్పు తీసుకుంది. అయితే ఈ రుణం చెల్లింపు విషయంలో గత వారం రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మంగళవారం భార్యాభర్తలు ఇద్దరూ మరోసారి గొడవపడ్డారు. తీసుకున్న రుణం వాయిదా చెల్లించేందుకు డబ్బులు ఇవ్వాలని లావణ్య అడగటంతో వీరబాబులో కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో భార్యపై బలంగా చేయి చేసుకున్నాడు. చెంపపై బలంగా కొట్టడంతో లావణ్య అక్కడిక్కడే చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే చెంపదెబ్బతోనే చనిపోయిందా లేదా మరేదైనా అనారోగ్య సమస్యనా అనే విషయం ఇంకా వెల్లడికాలేదు. కానీ వీరబాబు చెంపదెబ్బ కొట్టడంతోనే లావణ్య చనిపోయిందని స్థానికులు చెప్తున్నారు.
మరోవైపు వీరబాబు, లావణ్యలకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఊహించని విధంగా లావణ్య చనిపోవటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలు ఇద్దరూ తల్లిలేని వాళ్లు అయ్యారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. క్షణికావేశంలో వీరబాబు చేయి చేసుకోవటం ఆమె ప్రాణం తీసిందని ఆరోపిస్తున్నారు. లావణ్య కుటుంబసభ్యులు సైతం లావణ్యను వీరబాబు హత్యచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లైన నాటి నుంచి సరిగ్గా చూసుకోలేదని, ఎన్నో బాధలు పెట్టాడని ఆరోపించారు. లావణ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.