ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మండిపడ్డారు. విశాఖ వేధికగా సీఎం చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కౌంటరిచ్చారు. పరిపాలన రాజధానిలో ఇన్నాళ్లు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డొచ్చింది? అంటూ ప్రశ్నించారు. 'పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చేతకాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ మ్యాప్. ఆంధ్రుల తలమానికం వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించడం మీ విజన్. రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా మౌనం వహించడం మీకు ప్రాక్టికల్. గుట్టల్ని కొట్టడం,పోర్టులను అమ్మడం, భూములను మింగడం ఇదే విశాఖపై వైసీపీ విజన్'అంటూ మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటకాలు కాదా ? అంటూ ట్వీట్ చేశారు.
ఎన్నికల తర్వాత విశాఖలోనే నివసిస్తా.. తన ప్రమాణ స్వీకారం ఇక్కడే అంటూ సీఎం జగన్ ప్రకటించారు. సీఎం ఇక్కడికి వస్తే కార్యనిర్వాహక రాజధానిగా పురోగమిస్తుందని.. పదేళ్లలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలతో పోటీపడేలా విశాఖను తీర్చిదిద్దడంపై దృష్టి పెడతామన్నారు. పదేళ్లలో ‘విజన్ విశాఖ’ సాకారమయ్యేలా ప్రణాళిక రూపొందించామన్నారు. తాను విశాఖ వస్తానని అనగానే భూకబ్జాలకంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని.. సీఎం విశాఖ రాకూడదనే ఉద్దేశంతో కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. అమరావతిలో రాజధాని ప్రకటనకు ముందు బినామీల పేర్లతో కొన్న భూముల ధరలు తగ్గుతాయని భయపడుతున్నారన్నారు.
తనకు స్వార్థ ప్రయోజనాలే ఉంటే కడప గురించి మాట్లాడతా.. భవిష్యత్తు తరాలకు ఏది చేస్తే మంచిది? ఏంచేస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది.. ఆర్థికంగా పురోగమిస్తామని ఆలోచించిస్తానన్నారు.. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ కోసం తాను మాత్రమే నిల్చున్నా.. ఇందుకోసం ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియాతోనూ పోరాడుతున్నామన్నారు. అమరావతిని రాజధానిగా చేయడంపై వ్యతిరేకత లేదు.. శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించిందీ తానే అన్నారు. అమరావతిలోని 50 వేల ఎకరాల బంజరు భూమిలో కనీస సదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చవుతుంది అన్నారు. విశాఖలో కనీస సదుపాయాలన్నీ ఇప్పటికే ఉన్నాయని.. మెరుగులు దిద్దితే నగర రూపురేఖలు గణనీయంగా మారతాయన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక చోదకశక్తి హైదరాబాద్‌ను విభజన తర్వాత కోల్పోయామన్నారు. ఏపీ వ్యవసాధారిత రాష్ట్రంగా మిగిలిందని.. ప్రాథమిక రంగమైన వ్యవసాయంతో పోలిస్తే ద్వితీయ, తృతీయ రంగాలైన సేవా, తయారీ రంగాలు శరవేగంగా వృద్ధి చెందాలన్నారు. పారిశ్రామికవాడలతోపాటు విశాఖను అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి లభిస్తుందన్నారు. విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు.