కృష్ణా జిల్లా పెనమలూరు సమీపంలో కలకలంరేపిన మహిళ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీ వీడింది. వైకుంఠపురానికి చెందిన గోసాల పీతా జయలక్ష్మి.. ఈమె మేనమామ చేకూరి ప్రకాశరావు, అతడి భార్య జ్యోతిలు కానూరులో నివాసం ఉంటున్నారు. ఈ జంట గతంలో హోటల్ నిర్వహించారు.. నష్టాలతో అప్పుల పాలయ్యారు. ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాలేదు.. అప్పుడే మేనకోడలు జయలక్ష్మికి చెందిన బంగారు నగలు తాకట్టు పెట్టుకుంటామని అడగగా.. ఆమె నిరాకరించింది. అప్పుడే ఆమెను హత్యచేసి ఆభరణాలను తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ నెల 1న మధ్యాహ్నం దంపతులిద్దరూ సొంత ఆటోలో జయలక్ష్మి ఇంటికి వచ్చారు.
వణుకూరు జగనన్న కాలనీలో తమకు ఇంటి స్థలం మంజూరైందని.. చూసివద్దాం రమ్మంటూ మేనకోడలు జయలక్ష్మికి మాయ మాటలు చెప్పారు. ఇద్దరు నమ్మకంగా ఆమెను ఆటోలో తీసుకెళ్లారు. ఒకచోట వాహనాన్ని ఆపి బంగారు ఆభరణాలు ఇవ్వాలని జయలక్ష్మిని అడిగారు.. ఆమె ఒప్పుకోకపోవడంతో భార్యాభర్తలు ముందుగానే తెచ్చుకున్న చీర ముక్కతో జయలక్ష్మి మెడకు చుట్టి హత్య చేసి మృతదేహాన్ని అక్కడే ఖాళీ స్థలంలో పడేసి.. ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.
ఈ నెల 4న గొర్రెలకాపరులు ఈమె మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వగా.. పేపర్లలో వార్తలు రావడంతో ఆమె కుమారుడు కాళిదాసు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తల్లిని ఆమె మేనమామ దంపతులు ఈ నెల 1నతీసుకొని వెళ్లడం, అదేరోజు నుంచి ఆమె ఫోన్ పనిచేయడం లేదని వారికి తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా మృతురాలి కాల్ డేటా పరిశీలించారు. మేనమామ ప్రకాశరావుపై అనుమానంతో ఈ నెల 6న కానూరులో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జయలక్ష్మిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఆమె ఆభరణాలను ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.లక్ష తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రకాశరావు, అతడి భార్య జ్యోతిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు జయలక్ష్మి మరణం విషయంలో మరో అనుమానం కూడా తెరపైకి వచ్చింది.. ఆమె మెడకు చీర బిగించి ఊపిరాడకుండా చేశారు ప్రకాశరావు దంపతులు. ఆమె చనిపోయిందని ఖాళీ స్థలంలో వదిలేసి వెళ్లిపోయారు.
జయలక్ష్మి మృతదేహాన్ని ఈ నెల 4న గుర్తించారు. సాధారణంగా ఎవరైనా చనిపోయి 24 గంటలు దాటగానే చీమలు, పురుగులు పట్టడం, మృతదేహం కుళ్లిపోవడం కనిపిస్తుంది అంటు్నారు. కానీ జయలక్ష్మి మృతదేహాన్ని పరిశీలిస్తే అలా కన్పించలేదు. రెండు రోజులు కొన ఊపిరితో ఉండి నరకయాతన అనుభవించి అనంతరం మృతిచెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా గుర్తించి ఉంటే జయలక్ష్మి ప్రాణాలతో ఉండేది అంటున్నారు.