పశ్చిమగోదావరి జిల్లాలో ఆసక్తికర ఘటన జరిగింది. లంచం డిమాండ్ చేసిన పోలీసులను ఓ వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెండ్‌గా పట్టించారు. పాపం మనోడి బ్యాక్ గ్రౌండ్ తెలియని పోలీసులు.. అడ్డంగా బుక్కయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో గృహ హింస కేసులో నిందితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్ రైటర్‌ను ఏసీబీ అధికారులు వల పన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విజయవాడకు చెందిన విజయ్ సాగర్‌కు 2022 అక్టోబర్‌లో నరసాపురం పట్టణానికి చెందిన సుచితతో పెళ్లి జరిగింది. వీరిద్దరికీ ఓ కొడుకు పుట్టాడు. అయితే బాబు పుట్టిన తర్వాత భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలోనే భర్త విజయ్ సాగర్‌పై సుచిత నరసాపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుచిత ఫిర్యాదు మేరకు విజయ్ సాగర్ మీద గృహహింస చట్టం కింద నరసాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు నుంచి తప్పించడానికి విజయ్ సాగర్‌ను సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావు లంచం డిమాండ్ చేశారు. రూ.25 వేలు లంచం ఇస్తే కేసు లేకుండా చేస్తామని విజయ్ సాగర్‌కు చెప్పారు. అయితే విజయ్ సాగర్ తండ్రి హెడ్ కానిస్టేబుల్‌గా పోలీస్ డిపార్ట్ మెంట్‌లోనే పనిచేశారు. దీంతో పోలీసులకు లంచం ఇవ్వడానికి విజయ్ కుమార్ ఇష్టపడలేదు. ఎస్ఐ, రైటర్‌ను ఏసీబీకి పట్టించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే విజయ్ సాగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు తాను డబ్బులు ఇస్తానని ఎస్ఐ ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావుకు విజయ్ సాగర్ చెప్పారు. విజయ్ సాగర్ నుంచి డబ్బులు తీసుకోవడానికి ఎస్ఐ ప్రసాద్ స్టేషన్ జీపు డ్రైవర్‌ను పంపించారు. జీపు డ్రైవర్ ప్రసాద్ లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏలూరు డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఎస్ఐ ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావు, డ్రైవర్ ప్రసాద్‌లపై కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీహరి రాజు వెల్లడించారు.