ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నగరి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాకు అసమ్మతి సెగ రోజురోజుకూ పెరుగుతోంది. సొంత పార్టీ నేతలే రోజాకు టికెట్ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో నగరి టికెట్ రోజాకు మరోసారి ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నగరిలో సొంత పార్టీల నేతల నుంచి వస్తున్న విమర్శలపై రోజా రియాక్టయ్యారు. తన మీద ఆరోపణలు చేస్తున్న వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జగనన్న ముద్దు.. రోజమ్మ వద్దూ అంటూ ప్రెస్ క్లబ్‌లో రోజూ ఐదొందలు కట్టి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రోజామండిపడ్డారు. మీలాంటి వాళ్లు పార్టీలో ఉండటం వలనే తనకు నగరిలో మెజారిటీ తక్కువనీ.. లేకుంటే 30 వేల నుంచి 40 వేల మెజారిటీ ఖాయమని రోజా ధీమా వ్యక్తం చేశారు. మీరు మాట్లాడినట్లే తన మనుషులు మాట్లాడితే తట్టుకోగలరా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నగరిలో మాట్లాడటానికి మొహం లేక తిరుపతిలో కూర్చుని తనపై విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు.
ఇక తన హయాంలో నగరిని ఎంతో అభివృద్ధి చేశానని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. విపక్షాలతో ఒంటరిగా పోరాడుతూ సీఎం జగన్.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారో .. నగరిలో కూడా తాను ఒంటరిగా పోరాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు రోజా చెప్పుకొచ్చారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో నగరిలో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. తనను ఓడించడానికి కొంతమంది వీరిని రెచ్చగొడుతున్నారని రోజా వ్యాఖ్యానించారు.
అయితే.. సోమవారం నగరి నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు మంత్రి రోజాకు వ్యతిరేకంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వవద్దని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇస్తే మాత్రం ఓడించి తీరుతామని సవాల్ చేశారు. 2019లోనూ జగన్ హవాలో రోజాకు వచ్చింది కేవలం రెండువేల ఓట్ల మెజారిటీ మాత్రమేనని గుర్తు చేస్తున్నారు. నగరిలో రోజా పట్ల వ్యతిరేకత పెరిగిపోయిందనీ, టికెట్ ఇవ్వడం పార్టీకి నష్టమేనని తేల్చిచెప్తున్నారు. నగరిలో రోజా సోదరుల అవినీతి పెరిగిపోయిందనీ.. జగనన్న ముద్దు రోజా వద్దు అని వ్యాఖ్యానించారు. దీనిపైనా మంత్రి రోజా స్పందించారు.