ఏపీ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) శుభవార్త చెప్పింది. వరుసగా ఐదో ఏడాది కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించింది. ఈ విషయాన్ని ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీఈఆర్‌సీ నిర్ణయాలను ఆయన వివరించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గృహ, వాణిజ్య అవసరాల విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని నాగార్జున రెడ్డి తెలిపారు. రైల్వేలకు మినహా ప్రస్తుత ఏడాదిలో ఎలాంటి టారిఫ్ పెంపుదల లేదని తెలిపారు. అలాగే విద్యుత్ వినియోగంలో పౌల్ట్రీలు, సగ్గుబియ్యం తయారీ మిల్లుల లాంటి వాటికి ఊరట కల్గించేలా బిల్లులో.. 5 శాతం మేర తగ్గించాలని ఏపీఈఆర్‌సీ నిర్ణయించింది.
క్రాస్ సబ్సీడీ, వార్షికాదాయ అవసరాలు, టారిఫ్ పెంపు ప్రతిపాదనల్ని ఆంధ్రప్రదేశ్‌లోని మూడు డిస్కమ్‌లు ఈఆర్సీకీ సమర్పించాయి. వీటిపై బహిరంగ విచారణతో పాటు స్టాఫ్ అడ్వైజరీ కమిటీతో మాట్లాడిన అనంతరం ..2024-25 టారిఫ్ ఆర్డర్‍ను విడుదల చేస్తున్నట్లు ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ తెలిపారు. రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు రూ. 56,573 కోట్ల మేర వార్షిక ఆదాయ అవసరాన్ని ప్రతిపాదించినట్లు చెప్పారు. అనంతరం ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి దీనిని రూ. 56,501 కోట్లుగా కుదించిందని వివరించారు.
మరోవైపు ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోందని ఏపీఈఆర్‌సీ ఛైర్మన్ తెలిపారు. అయితే ఓవైపు వినియోగదారులపై ఈ భారం వేయకుండానే, మరోవైపు బహిరంగమార్కెట్లో విద్యుత్ కొనుగోళ్ల ప్రభావం పడకుండా ఈఆర్సీ ప్రయత్నించిందని చెప్పుకొచ్చారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్ల వ్యత్యాసం కనిష్టస్థాయి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. డీబీటీ చెల్లింపుల తర్వాత డిస్కంల ఆదాయ లోటు రూ.15,299 కోట్లుగా ఈఆర్సీ నిర్ధారించిందన్నారు.
మరోవైపు ట్రూఅప్ ఛార్జీలు, ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సీడీ కలిపి మొత్తంగా రూ.13,589 కోట్లుగా తేలిందని ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. ఈ సబ్సిడీ మొత్తాన్ని తాము చెల్లిస్తామని ప్రభుత్వం లేఖరాసినట్లు వివరించారు. సబ్సిడీ మొత్తం గతేడాది చెల్లించిన దానికంటే 3500 కోట్లు ఎక్కువని చెప్పారు. రూ.13,589.18 కోట్ల సబ్సి డీ భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో.. పంపిణి సంస్థల ఆదాయ లోటును పూడ్చుకోవటంతో పాటు.. వినియోగదారులపై చార్జీలను పెంచాల్సి న అవసరాన్ని రాలేదన్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి సబ్సీడీ చెల్లింపులు ఆలస్యమైతే దానిపై వడ్డీ చెల్లించేలా ఈఆర్సీ ఆదేశించింది. అలాగే గ్రీన్ ఎనర్జీ టారిఫ్ ను రూ.0.75 పైసలకు కమిషన్ ఆమోదించింది.