నందమూరి తారకరత్న ప్రథమ వర్ధంతి సందర్భంగా తండ్రి మోహనకృష్ణ పెద్ద మనసుతో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తారకరత్న జ్ఞాపకార్థం తిరుమల శ్రీవారి భక్తుల అన్నదానానికి మోహనకృష్ణ, కుమార్తె మోహనరూపతో కలిసి రూ.15 లక్షలు విరాళాన్ని టీటీడీకి అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ భవనంలో భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. తారకరత్న మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుమలలో అన్నదానం చేసినట్లు మోహనకృష్ణ తెలిపారు.
1985లో ఎన్టీఆర్ తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదాన భవనాన్ని ప్రారంభించారని.. అదే స్ఫూర్తితో తారకరత్న పేరుతో భక్తులకు ఒకరోజు అన్న ప్రసాదం అందజేసినట్లు వెల్లడించారు. నందమూరి తారకరత్న తమ మధ్య లేకపోవడం బాధాకరమని ఆయన తండ్రి మోహనకృష్ణ విచారం వ్యక్తం చేశారు. అంతకముందు తిరుమల శ్రీవారిని తారకరత్న తండ్రి నందమూరి మోహనకృష్ణ, సోదరి మోహనరూప దర్శించుకున్నారు. మరోవైపు తారకరత్న భార్య అలేఖ్య, కూతురు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నందమూరి తారకరత్న గతేడాది జనవరిలో ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే ఆయన్ను కుప్పంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బెంగళూరుకు తరలించారు.. అక్కడ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గతేడాది ఫిబ్రవరి 18న కన్నుమూశారు.
తారకరత్న ప్రథమ వర్థంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లు స్పందించారు. తారకరత్న తమను వదిలి వెళ్లి ఏడాది అయ్యిందంటే నమ్మలేకపోతున్నామన్నారు చంద్రబాబు. ప్రథమ వర్థంతి వేళ తారకరత్నను స్మరించుకుంటున్నామని.. చాలా చిన్న వయసులోనే అందరికీ దూరం కావడం బాధాకరమన్నారు. తారకరత్న వదిలి వెళ్లిన జ్ఞాపకాలే ఓదార్పు.. ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకుంటామన్నారు. 'తారకరత్న మమ్మల్ని వదిలి వెళ్లి అప్పుడే ఏడాది అయిందా? నీవు వదిలి వెళ్లిన మధురమైన జ్ఞాపకాలు నిన్ను మా మనసుల్లో సజీవంగా ఉంచుతున్నాయి. ప్రియమైన సోదరుడా... నిన్ను మేం ఎంతగానో మిస్సవుతున్నాం' నారా లోకేష్ ట్వీట్ చేశారు.