ఆమె చేసిన తప్పల్లా... తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తోందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లలో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధికుక్కల్లా వెంటాడాయి. మారుపేర్లతో సంచరించే నీతీజాతీ లేని ఈ ఆన్‌లైన్ మారీచులు.... తాము మనుషులమన్న సంగతే మరిచిపోయి ప్రతి వేదికమీదా ఆమెను నానా దుర్భాషలాడారు. అక్కచెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలు ఉంటారని గ్రహింపే లేని రీతిలో ఆ బీసీ మహిళ గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేషభాషలను ఎగతాళి చేస్తూ, అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యమనుకుంది. రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వెంటాడి వెంటాడి చేసిన దారుణమైన హత్య. గొల్తి గీతాంజలి (30) భర్త చంద్రశేఖర్ తెనాలిలోని వహాబ్ పార్క్ ప్రాంతంలో బంగారం పని చేస్తుంటారు. వాళ్లకిద్దరు పిల్లలు. గీతాంజలి కొద్దిరోజుల కిందట ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. తనకు ఇంటిపట్టా ఇచ్చారని, పిల్లలకు అమ్మ ఒడి వస్తోందని, అత్తమామలకు చేయూత, పింఛన్ కానుక అందుతున్నాయని చెబుతూ సీఎం వైఎస్ జగన్‌కు, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు ధన్యవాదాలు తెలియజేసింది.జగనన్నకు తప్ప ఇంకెవరికి ఓటు వేస్తామంటూ.. ఆమె ఎదురు ప్రశి్నంచిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన కిరాయి మూకలు సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా వేధించాయి. ఆమెను కించపరుస్తూ విపరీతంగా ట్రోల్స్ చేశాయి. వాస్తవానికి గీతాంజలికి గతంలోనే ఇంటి స్థలం మంజూరైంది. ఇటీవల ప్రభుత్వం ఆమెకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందచేసింది.ఈ నెల 4న కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆమె హాజరైనప్పుడు ఈ ఇంటర్వ్యూ వ్యవహారం చోటుచేసుకుంది. ఉదయమే సభా ప్రాంగణానికి వచ్చిన గీతాంజలి అందరితోపాటు ఎమ్మెల్యే శివకుమార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఎంతో ఉత్సాహంగా కనిపించింది. ఎమ్మెల్యే చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ పట్టాను అందుకున్నాక తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ చానల్‌తో పంచుకుంది.కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న తమకు ఇంటి స్థలం పొందడం ద్వారా కల నెరవేరిందంటూ ఉద్వేగంగా మాట్లాడింది. జగనన్నను గెలిపించుకోవటం తమ బాధ్యతని పేర్కొంది. ఫీజులు కట్టలేని తమకు అమ్మఒడి ఆసరాగా నిలిచిందని, తన పిల్లలిద్దరూ ఈ కార్యక్రమానికి వస్తే జై జగన్.. అని నినదించేవారని ఉత్సాహంగా చెప్పింది. ఈ క్రమంలో కొంత భావోద్వేగానికి గురి కావడం, మీడియా ఎదుట మాట్లాడే అలవాటు లేకపోవడంతో తడబాటుకు గురైంది. దీన్ని అవకాశంగా మలుచుకున్న టీడీపీ, జనసేన ‘సోషల్ మాఫియా’ బాధితురాలిని దారుణంగా ట్రోల్ చేసింది.ఉచ్చం నీచం లేకుండా అసభ్యంగా దూషిస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని తప్పు పడుతూ, రాయలేని భాషలో దుర్భాషలాడుతూ కొందరు కామెంట్లు పెట్టారు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాంజలి శనివారం తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు హుటాహుటిన ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తెనాలి జీఆర్పీ పోలీసులు గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుని కుటుంబ సభ్యులను విచారించగా సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాల కారణంగా ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వల్ల తాను, తన కుటుంబం లబ్ధి పొందినట్లు గతంలో కూడా ఆమె కొన్ని వీడియోల్లో పేర్కొన్నారు. గీతాంజలిని ఆత్మహత్యకు పురిగొల్పేలా దారుణ వ్యాఖ్యలతో వికృతంగా వ్యవహరించిన సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.