కొత్త వందే భారత్ రైళ్లు మంగళవారం ప్రారంభమయ్యాయి. వీటిని వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య ఒక రైలును, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య మరో వందే భారత్ రైలును ప్రారంభించారు. అదేవిధంగా వాల్తేరు డివిజన్‌లో ఇప్పటివరకు పూర్తయిన డబ్లింగ్ పనులను, మూడో లైన్ పనులను, విశాఖ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక బొమ్మల స్టాల్‌ను ప్రధాని ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో రామ్‌కో సిమెంట్స్‌కు ముడిసరుకు రవాణా చేసే.. గతి శక్తి కార్గో టెర్మినల్ ప్రాజెక్టును కూడా మోదీ ప్రారంభించారు. వాల్తేరు డీఆర్‌ఎం సౌరభ్ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పద్మశ్రీ ఆదినారాయణరావు, పద్మశ్రీ కూటికుప్పల సూర్యారావు, ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఏలూరు రైల్వేస్టేషన్ గూడ్స్‌షెడ్డు ప్రాంతంలోని పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు చేయగా, ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.